Ranveer Deepika:పెళ్లి అయిన ఆరేళ్లకు.. గుడ్ న్యూస్ చెప్పిన రణ్‌వీర్-దీపికా..

  • IndiaGlitz, [Thursday,February 29 2024]

గత కొంతకాలంగా బాలీవుడ్ జంట రణవీర్ సింగ్, దీపికా పదుకొణె తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో దీపికా బేబీ బంప్‌తో కూడా కనిపించింది. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ ఇప్పటివరకు ఈ విషయాన్ని ఈ జంట అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజాగా తాము తల్లిదండ్రులు కాబోతున్నామంటూ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వైద్యులు డెలివరీ డేట్ ఇచ్చినట్లు కూడా తెలిపారు.

'సెప్టెంబర్ 2024’ అని డేట్ పెట్టి దాని చుట్టూ పిల్లలకు సంబంధించిన బట్టలు, షూస్ ఉన్న ఫోటోను రణవీర్ సింగ్, దీపికా పదుకొనె కలిసి తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో సెలబ్రెటీలు, అభిమానులు, నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొత్తానికి పెళ్లి అయిన ఆరేళ్ల తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మ ఇవ్వబోతున్నారు. ఇప్పటివరకు రణవీర్, దీపికా హీరోహీరోయిన్లుగా రెండు సినిమాల్లో నటించారు.

కాగా 2013లో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘రామ్ లీలా’ మూవీ షూటింగ్‌లో రణవీర్, దీపికా తొలిసారి కలిశారు. ఈ మూవీ షూటింగ్‌లో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఐదేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. చివరకు 2018 నవంబర్‌లో ఫైనల్‌గా సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి వీడియో మాత్రం బయటకు రాలేదు. ఇటీవల కొన్నిరోజుల క్రితం ఇద్దరు ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్నారు. అందులో వీరి వెడ్డింగ్ వీడియోను తొలిసారి ప్రదర్శించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పెళ్లయిన తర్వాత కూడా దీపికా సినిమాల్లో బిజీగా ఉంది. గతేడాది షారుఖ్‌ ఖాన్‌తో కలిసి 'పఠాన్' మూవీ చిత్రంలో నటించింది. ఈ సినిమా బ్లాక్‌బాస్టర్ హిట్ అయింది. అలాగే షారుఖ్ హీరోగా తెరకెక్కిన మరో మూవీ ‘జవాన్’లోనూ గెస్ట్ రోల్‌లో అలరించింది. ఇక హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన ‘ఫైటర్’మూవీలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా మరోసారి ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. రణ్‌వీర్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.