పల్లెటూరి సినిమా `ఉయ్యాల జంపాల`తో అందరి మన్ననలు పొందిన హీరో రాజ్‌తరుణ్. ఆ తర్వాత చేసిన `సినిమా చూపిస్త మావ`, `కుమారి 21ఎఫ్` సినిమాలు ఆయనకు పెద్ద హిట్ అయ్యాయి. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ సోసోగానే ఆడాయి. `ఉయ్యాల జంపాల`తో అసోసియేట్ అయిన నాగార్జున తాజాగా రాజ్‌తరుణ్‌తో తెరకెక్కించిన సినిమా `రంగులరాట్నం`. పండుగకు తగ్గట్టే జనాల నాడిపట్టుకునేలా పేరు పెట్టారు. సంక్రాంతికి విడుదల చేశారు. అన్నపూర్ణ సంస్థ వడ్డిస్తున్న బొబ్బట్టు అని నాగార్జున అక్కినేని స్వయంగా ప్రకటించిన ఈ సినిమా ఎలా ఉందో ఓ లుక్కేసేయండి.
కథ:
విష్ణు (రాజ్‌తరుణ్) ఓ ప్రైవేట్ కంపెనీ నిర్వహించుకుంటుంటాడు. నెలకి రూ.40వేల జీతం, సొంత ఇల్లు, కన్నతల్లితో ఉంటాడు. అతనికి పెళ్లి చేయాలని కన్నతల్లి (సితార) కోరిక. అత్తగారిని తల్లిలాగా చూసుకునే కోడలైతే బావుంటుందని విష్ణుకి కోరిక. ఆ క్రమంలోనే ఓ పెళ్లిలో కీర్తి (చిత్ర శుక్ల)ని చూస్తాడు విష్ణు. ఆమెను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆ విషయాన్ని ఆ అమ్మాయికన్నా ముందు తల్లికి చెప్తాడు. ఆమెకు కూడా కీర్తి నచ్చుతుంది. కొడుక్కి తెలియకుండా కీర్తితో పెళ్లి గురించి మాట్లాడుతుంది. ఓ రోజు నిద్రలోనే కన్నుమూస్తుంది తల్లి. తల్లిపోయిన తనని ఓదార్చడానికి వచ్చిన కీర్తికి మనసులో మాట చెప్పేస్తాడు విష్ణు. అతన్ని ప్రేమిస్తున్నాని, ఎప్పటికైనా అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది కీర్తి. అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటున్న సమయంలో కీర్తి సావాసాన్ని విష్ణు టార్చర్‌గా ఫీలవుతాడు. అతను అలా ఎందుకు ఫీలయ్యాడు? కీర్తికి ఉన్న భయాలు ఎలాంటివి? అనేది మిగిలిన స్టోరీ.
సమీక్ష:
అతి సర్వత్రా వర్జయేత్.. అనే పాయింట్‌ను ఆధారంగా చేసుకుని అల్లుకున్న సబ్జెక్ట్ ఇది. ఏదైనా మితిమీరితే చేటని చెప్పే సినిమా ఇది. తన చిన్నతనంలో జరిగిన ఘటనల వల్ల హీరోయిన్‌లో గూడుకట్టుకున్న ఫోబియా కారణంగా హీరోపై ఆమె చూపించే అతి ప్రేమ, దాన్ని అతను ఎలా అర్థం చేసుకున్నాడు.. వంటి సన్నివేశాలను ఆధారంగా చేసుకుని కథను అల్లారు. హీరో తల్లి చనిపోయినప్పుడు వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అలాగే సెకండాఫ్‌లో హీరోయిన్ భయపడే సన్నివేశాలు కూడా మెప్పిస్తాయి. అక్కడక్కడా ప్రియదర్శి కామెడీ బావుంది. సినిమాకు హైలైట్ కెమెరా. ఎడిటింగ్ అసలు బాగోలేదు. సినిమా మొత్తం బైక్ మీద అటూ,ఇటూ తిరుగుతున్నవారిని చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. తల్లీ,కొడుకుల అనుబంధాన్ని చూపించడానికి సగం సినిమా అక్కర్లేదు. మంచి సన్నివేశాలు మూడు, నాలుగు ఉంటే సరిపోయేవి. హీరో తల్లి మృతికి ఏదైనా కారణం ఉందేమోనని ప్రేక్షకుడు ఎదురుచూస్తుంటాడు. అయితే అలాంటివి ఏ కోశానా కనిపించవు. స్టోరీ లైన్ చాలా ఫ్లాట్‌గా అనిపించింది. సినిమా జరుగుతున్నంత సేపు ఆడవారి మాటలకు అర్థాలే వేరులేతో పాటు చాలా సినిమాలు గుర్తుకొస్తాయి. అయితే వాటిని కూడా ఆసక్తికరంగా పేర్చలేకపోవడం ఇబ్బందిగా మారుతుంది.
బాటమ్ లైన్: వెలవెలబోయిన రంగులరాట్నం
Comments