Ujjaini mahankali bonalu: నాదే కాజేస్తున్నారు.. ఆగ్రహంతోనే భారీ వర్షాలు : భవిష్యవాణిలో జోగిని స్వర్ణలత

  • IndiaGlitz, [Monday,July 18 2022]

బోనాల జాతర జంట నగరాల్లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో నిన్నటి నుంచి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. తెల్లవారుజామునే ఆలయానికి చేరుకుంటున్న భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇకపోతే బోనాల సందర్భంగా సోమవారం ‘రంగం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.

నా ఆగ్రహం వల్లే భారీ వర్షాలు:

‘‘ నా రూపాన్ని ఇష్టం వచ్చినట్లు మారుస్తున్నారని... నా రూపాన్ని స్థిరంగా నిలబెట్టండి. గర్భాలయంలో మొక్కుబడి పూజలు వద్దు , అవి మీ సంతోషానికి తప్పా, నా కోసం కాదు. నా గుడిలో పూజలు సరిగా జరిపించడం లేదు. దొంగలు దోచుకున్నట్లు నాదే కాజేస్తున్నారు. అయినా నా బిడ్డలే కదా అని అన్ని భరిస్తున్నా. ఇకనైనా శాస్త్రబద్ధంగా పూజలు చేయండి. నా ఆగ్రహాన్ని వర్షాల రూపంలో చూపించానని ’’ స్వర్ణలత భవిష్యవాణిలో తెలిపారు.

సాయంత్రం అమ్మవారి అంబారి ఊరేగింపు:

అవివాహిత అయిన జోగిని శరీరాన్ని అమ్మవారు ఆవహించి జరగబోయే విశేషాలను చెబుతుందని, ఆమె పలికే మాటలు అక్షరాల నిజమవుతాయని భక్తుల విశ్వాసం. భవిష్యవాణి అనంతరం అమ్మవారి అంబారి ఊరేగింపు కార్యక్రమం జరగనుంది. సోమవారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుక అర్ధరాత్రి వరకు సాగనుంది. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే మహంకాళి అమ్మవారి బోనాల జాతర పూర్తవుతుంది.