Download App

Rang De Review

సినిమాలకు కాస్త గ్యాప్‌ తీసుకున్న నితిన్‌ స్పీడు పెంచి వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ వరుసలో గత ఏడాది భీష్మతో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కోవిడ్‌ నేపథ్యం, లాక్డౌన్‌ తర్వాత థియేటర్స్‌ ఓపెన్‌ అయ్యాయి. ఆ వెంటనే  విడుదలైన చెక్‌ నితిన్‌ను నిరాశ పరిచింది. ఈ క్రమంలో నితిన్‌ హీరోగా నటించిన చిత్రం 'రంగ్‌ దే'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలిప్రేమతో హిట్‌ కొట్టిన డైరెక్టర్‌ వెంకీ అట్లూరి మిస్టర్‌ మజ్నుతో ప్లాప్‌ సినిమా తీశాడు. ఈ యంగ్‌ డైరెక్టర్‌ తెరకెక్కించిన రంగ్‌ దే.. టీజర్‌, ట్రైలర్‌, నితిన్‌-కీర్తిసురేష్‌ పెయిర్‌ సినిమాపై అంచనాలు క్రియేట్‌ అయ్యేలా చేయడంలో సక్సెస్‌ అయ్యాయి. మరి సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? ప్రేక్షకులను మెప్పించిందా?  అసలు వెంకీ అట్లూరి ఈ సినిమాతో ఏం చెప్పాలనుకున్నాడు... నితిన్‌-కీర్తి జంట ఆకట్టుకుందా? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా కథ తెలియాల్సిందే.

కథ:

అర్జున్‌, అను చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. అర్జున్‌ అంటే అనుకి చాలా ఇష్టం. కానీ అనుని చూసి అర్జున్‌ని తండ్రి తిడుతుండటంతో.. అను అంటే అర్జున్‌కి కోపం వస్తుంది. తర్వాత అది పెరిగి ద్వేషంగా మారుతుంది. అను పెద్దయ్యేసరికి అర్జునపై ఉండే ఇష్టం ప్రేమగా మారుతుంది. ఆ ప్రేమతో అర్జున్‌ చేసే తప్పులను పట్టించుకోదు. ఇంజనీరింగ్‌ చదివిన తర్వాత ఇద్దరూ జీ మేట్‌ ఎగ్జామ్‌లో పాస్‌ అయ్యి దుబాయ్‌లోని ఒకే యూనివర్సటికీ అప్లై చేస్తారు. తను దుబాయ్‌ వెళ్లాలంటే అను వెళ్లకూడదని తెలిసిన అర్జున్‌.. అనుకి మరొకరితో పెళ్లి జరిగేలా ప్లాన్‌ చేస్తాడు. అయితే అర్జున్‌ ప్లాన్‌ తెలుసుకున్న అను.. మరో ప్లాన్‌ వేసి అర్జున్‌ని పెళ్లి చేసుకుంటుంది. తర్వాత జరిగే పరిణామాల క్రమంలో ఇద్దరూ దుబాయ్‌ వెళతారు. అక్కడ అర్జున్‌.. నువ్వంటే ఇష్టం లేదంటూ అనుకి చెబుతాడు. తన ప్రేమను అర్జున్‌ అర్థం చేసుకోలేదని భావించిన అను.. చివరకు అర్జున్‌కి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది? అను, అర్జున్‌ విడిపోతారా.. కలుసుకుంటారా?  అనుకి తనపై ఉన్నప్రేమను అర్జున్‌ అర్థం చేసుకుని దగ్గరవుతాడా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సమీక్ష:

రంగ్‌ దే సినిమాలో నితిన్‌ జోడీగా కీర్తి సురేష్‌ అనగానే ప్రేక్షకాభిమానుల్లో కాస్త క్యూరియాసిటీ క్రియేట్‌ అయ్యింది. వెంకీ అట్లూరి ఈ జోడీతో ఎలాంటి సినిమాను చేస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ క్రమంలో విడుదలైన 'రంగ్‌ దే' సినిమా టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే సమయంలో నితిన్‌ పెళ్లి కూడా అవుతుండటంతో ఈ టీజర్‌ అందరికీ నచ్చింది. అలాగే బస్టాండే బస్టాండే పాట కూడా నితిన్‌ పెళ్లికి కనెక్ట్‌ అయ్యేలా అనిపించడంతో ప్రేక్షకులు సినిమాలో కావాల్సినంత ఫన్‌ ఉందని అందరిలో సినిమాపై అంచనాలు పెరిగాయి. నరేష్‌, కౌసల్య, రోహిణి, వెన్నెల కిషోర్‌, అభినవ్‌, సుహాస్‌ ఇలా మంచి స్టార్‌ కాస్ట్‌ కూడా దర్శకుడికి బాగానే కలిసొచ్చింది. లవ్‌, ఫ్యామిలీ స్టోరీస్‌ ఒకేలా ఉంటాయి. కానీ.. దాన్ని ఎలివేట్‌ చేసే తీరులో కొత్తదనం, సంగీతం, సినిమాటోగ్రఫీ దర్శకుడి పనితనానికి తోడు అయినప్పుడు సినిమాకు అది ప్లస్‌ అవుతుంది. కథ పరంగా చూస్తే రంగ్‌ దే రొటీన్‌ సినిమానే హీరో, హీరోయిన్‌లలో ఒకరు ఒకరిని ప్రేమిస్తే.. మరొకరు ద్వేషిస్తుంటారు. తర్వాత అనుకోకుండా ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. పరిస్థితుల ప్రభావంతో ఒకే ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి. అప్పుడు హీరో, హీరోయిన్‌ మధ్య అనుబంధం పెరగడం.. హీరో హీరోయిన్‌ మధ్య ఓ కమెడియన్‌..చివరకు హీరో హీరోయిన్‌ కలిసిపోవడం.

కథ ఇదే అయినా, వెంకీ అట్లూరి సినిమాను ఎంటర్‌టైన్‌మెంట్‌ యాంగిల్‌లో తీసుకెళ్లాడు ఫస్టాప్‌ విషయానికి వస్తే హీరో, హీరోయిన్‌ మధ్య ప్రేమ, ద్వేషించే సన్నివేశాలు. హీరో, స్నేహితుల మధ్య కామెడీ ట్రాక్‌. హీరో ఇంజనీరింగ్‌ను పాస్‌ కావడానికి పడే తిప్పలు. అదే సమయంలో దుబాయ్‌ యూనివర్సిటీలో చదవడానికి వెళ్లే సమయంలో హీరో చేసే కామెడీ పనులు అన్నీ ప్రేక్షకులను నవ్విస్తాయి. అలాగే హీరోయిన్‌ను ఏడిపించడానికి వచ్చిన సత్యం రాజేష్‌ అండ్‌ గ్యాంగ్‌తో హీరో ఫైట్‌ .. చివరకు హీరో ప్లాన్‌ని అర్థం చేసుకున్న హీరోయిన్‌ అతనికి బుద్ధి చెప్పడానికి తనను పెళ్లి చేసుకోవాలనుకోవడంతో ముగుస్తుంది. ఇక సెకండాప్‌లో హీరో, హీరోయిన్‌ దుబాయ్‌ వెళ్లడం అక్కడే కమెడియన్‌ వెన్నెలకిషోర్‌ వారికి తోడు కావడం. పెళ్లయిన హీరో, హీరోయిన్‌ ఒకే ఇంట్లో ఉండాలనుకోవడం. అనుకోని పరిస్థితుల్లో హీరోయిన్‌ ప్రెగ్నెన్సీ తర్వాత జరిగే పరిణామాలతో హీరో మనసు మారడం వంటి సన్నివేశాలతో క్లైమాక్స్‌.  సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్‌ ముందు వరకు కామెడీ నేపథ్యంలో సినిమా సాగినా, చివరి ముప్పై నిమిషాలు కాస్త ఎమోషనల్‌ యాంగిల్‌లో రన్‌ అవుతుంది. ఆ సన్నివేశాలను దర్శకుడు వెంకీ అట్లూరి చక్కగా హ్యాండిల్‌ చేశాడు. పీసీ శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. పాటలు సహా సినిమాను తన కెమెరాలో బంధించిన పీసీ ప్రేక్షకులను ఫిదా చేశాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతంలో పాటల విషయానికి వస్తే మాంటేజ్‌ సాంగ్స్‌కు ప్రాధాన్యత ఎక్కువగా ఉండటంతో పాటలు అలా సాగిపోతాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే .. ముప్పై ఆరేళ్ల నితిన్‌ పాతికేళ్ల లోపు కుర్రాడిగా కనిపించడానికి బాగానే కష్టపడ్డట్టు కనిపిస్తుంది. పీసీ కెమెరా మాయాజాలం తోడు కావడంతో నితిన్‌ లుక్ యంగ్‌గానే కనిపించాడు. కీర్తి చాలా సన్నబడింది. అయితే సినిమాలో హీరోను డామినేట్‌ చేసే సన్నివేశాల్లో, తన ప్రేమను ప్రూవ్‌ చేసుకునే సన్నివేశాల్లో కీర్తి తనదైన మార్కు నటనతో మార్కులను కొట్టేసింది. ఇక సెకండాఫ్‌లో ఎమోషనల్‌ సీన్స్‌లోనూ అంతే. సీనియర్‌ నరేష్‌, కౌసల్య, రోహిణి తదితరులు వారి వారి పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. కథలో భాగంగా సినిమా ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. ఫస్టాఫ్‌లో హీరోతో పాటు అభివన్‌, సుహాస్‌ కామెడీ ట్రాక్‌ భారాన్ని మోస్తే..సెకండాఫ్‌లో వీరికి వెన్నెలకిషోర్‌ తోడయ్యాడు. మ్యాజిక్‌ ప్రతీసారీ రిపీట్‌ కాకపోవచ్చు. కాబట్టి వెంకీ అట్లూరి కథ విషయంలో రొటీన్‌ కథనే ఎంచుకున్నాడు. నెక్ట్స్‌ ఏం జరగుతుంది? క్లైమాక్స్‌ ఏంటి? అనే విషయాలు ప్రేక్షకులకు ముందుగానే తెలిసిపోతాయి. దీంతో కథలో కొత్తదనమేమీ లేదుగా అనిపిస్తుంది.

బోటమ్‌ లైన్‌:  ఫ్యామిలీ ప్లస్ యూత్ కలర్స్... రంగ్ దే

Read 'Rang De' Review in English



Rating : 3.0 / 5.0