Download App

Ranarangam Review

ప్ర‌భాస్ న‌టిస్తున్న `సాహో` విడుద‌ల తేదీ వాయిదా ప‌డ‌గానే ఆగ‌స్ట్ 15న వ‌స్తున్నామ‌ని ప్ర‌క‌టించిన తొలి చిత్రం `రణ‌రంగం`. `ప‌డిప‌డి లేచే మ‌న‌సు`లో ల‌వ‌ర్‌బోయ్‌గా న‌టించిన త‌ర్వాత శ‌ర్వానంద్ చేసిన సినిమా ఇది. త‌న ఏజ్ క‌న్నా ఎక్కువ ఏజ్ ఉన్న కేర‌క్ట‌ర్‌ని ఇందులో ఆయ‌న చేశారు. గ్యాంగ్‌స్ట‌ర్ లుక్‌తో పోస్ట‌ర్స్ లోనూ, ట్రైల‌ర్స్ లోనూ ఆయ‌న ఆక‌ట్టుకున్నారు. ఈ చిత్రం ట్రైల‌ర్ చూసి `కో అంటే కోటి` త‌ర‌హా చిత్ర‌మ‌ని రామ్‌చ‌ర‌ణ్ కూడా కితాబిచ్చారు. స్వాతంత్ర్య‌దినోత్స‌వం రోజున విడుద‌లైన `ర‌ణ‌రంగం` బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి సంద‌డి చేస్తుంది?  యూనిట్ ఆశించిన మంచి ఫ‌లితాలు వ‌స్తాయా?  అటు సుధీర్ వ‌ర్మ‌, ఇటు శ‌ర్వానంద్ కాంబినేష‌న్ హిట్ అవుతుందా?  రివ్యూలోకి వెళ్దాం.

కథ:

దేవా(శర్వానంద్) పెద్ద మాఫియా డాన్. స్పెయిన్‌లో తన కుమార్తెతో కలిసి ఉంటాడు. ఓ సందర్భంలో అక్కడొక డాక్టర్(కాజల్ అగర్వాల్)తో పరిచయం అవుతుంది. కూతురితో ఉన్నప్పుడు తప్ప.. మిగిలిన సందర్భాల్లో తన మాఫియా వ్యవహారాలను చూస్తుంటాడు. ఇండియాకు చెందిన బిజినెస్‌మేన్(అజయ్) వైజాగ్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కట్టడానికి అనుమతి తెచ్చుకుంటాడు. అయితే అతను కట్టబోయే ఎయిర్ పోర్ట్ ప్రదేశంలో 12వేల మంది పేదలు నివసిస్తుంటారు. వారిని ఖాళీ చేయించడానికి అందరూ ఆలోచనలో ఉంటారు.. అందుకు కారణం వారి వెనుక దేవా ఉన్నాడనే భయం. దాంతో వారిని ఖాళీ చేయిస్తే రూ.600 కోట్లు ఇస్తామని అంటారు. దేవా ఒప్పుకోడు. సెంట్రల్ మినిస్టర్ రంగంలోకి దిగినా పని కాదు.. దాంతో దేవాను చంపేయాలనుకుంటాడు అజయ్. అతనికి దేవా పాత శత్రువు సింహాచలం(మురళీశర్మ) తోడవుతాడు. స్పెయిన్‌లో దేవాపై ఎటాక్ జరుగుతుంది. దేవా ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్‌లో జాయిన్ అవుతాడు. డాక్టర్స్ సహాకారంతో బ్రతుకుతాడు. అయితే హాస్పిటల్‌లో కూడా దేవాపై హత్యాయత్నం జరుగుతుంది. ఆలోపు దేవా స్నేహితులు అతన్ని కాపాడుతారు. అసలు దేవాను చంపాలనుకున్నదెవరు? సింహాచలంకు, దేవాకు ఉన్న గొడవలేంటి? గీత ఎవరు? దేవా మాఫియా డాన్‌గా ఎలా మారాడు? చివరకు దేవా శత్రువులను ఏం చేశాడు?  అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ:

మాఫియా బ్యాక్‌డ్రాప్ సినిమాలను తెరకెక్కించాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఏదీ చేసినా హాలీవుడ్ సినిమా గాడ్ ఫాదర్ నుండి ఇన్‌స్పిరేషన్ అని ఒక పక్క అంటారు. మరో పక్క రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించని మాఫియా చిత్రాలు లేవు. అదీగాక కమల్ హాసన్ నాయకుడు, రజనీకాంత్ బాషా చిత్రాలు ఇలా చాలా చిత్రాలను ప్రేక్షకుడు మనసులో ఊహించుకుంటూనే థియేటర్‌లోకి అడుగుపెడతాడు. అంటే అంచనాలను మోస్తూ వెళ్లే ప్రేక్షకుడిని అందుకోవడంలో ఏ మాత్రం విఫలమైనా పెదవి విరిచేస్తాడు మరి. అలాంటి అంచనాలతో ప్రేక్షకుడు రణరంగం సినిమాకు వస్తాడనంలో సందేహం లేదు. అయితే నటీనటుల విషయానికి వస్తే శర్వానంద్ రెండు లుక్స్‌లో కనపడ్డాడు. అందులో మొదటిది వైజాగ్ పాతపోస్టాఫీస్ బస్తీ యువకుడుగా.. అక్కడ థియేటర్స్‌లో స్నేహితులు నవీన్, రాజా, ఆదర్శ తదితరులతో కలిసి బ్లాక్ టికెట్స్ అమ్ముతుంటాడు. ఓరోజు హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ చూసి ప్రేమలో పడటం ఒక  పక్క ప్రేమిస్తూనే బస్తీ కోసం లోకల్ ఎమ్మెల్యేతో గొడవపడతాడు. డబ్బు సంపాదనకు లిక్కర్ మాఫియాలోకి అడుగు పెట్టి ఎదుగుతాడు. అక్కడ నుండి గొడవలు పెద్ద స్థాయిలో జరగడం, వాటి వల్ల భార్యను కోల్పోవడం జరుగుతుంది. తర్వాత కూతురితో కలిసి స్పెయిన్ వెళతాడు. అక్కడే ఉంటూ ఇక్కడి ప్రజలకు సపోర్ట్ చేస్తుంటాడు. రాజకీయాలు చేస్తుంటాడు. ఈ పోర్షన్‌లో శర్వా నాలుగు పదుల వయసున్న వ్యక్తిగా కనపడతాడు. రెండు షేడ్స్‌ను శర్వా చక్కగా పోషించాడు. ఇక హీరో ప్లాష్ బ్యాక్ ఏపిసోడ్‌లో కల్యాణి ప్రియదర్శన్ రోల్ కనపడుతుంది. హీరోని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, చనిపోవడం ఇలా ఆమె పాత్ర సాగుతుంది. రొటీన్ మాఫియా డాన్ భార్య పాత్రలో కనపడుతుంది. పాత్ర పరిధి మేర కల్యాణి చక్కగా నటించింది. ఇక కాజల్ అగర్వాల్ స్పెయిన్‌లో డాక్టర్ పాత్రలో కనపడుతుంది. ఈ పాత్రను ఆమె ఎందుకు చేసిందో ఏమో మరి. ఎందుకంటే ఈ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత కనపడదు. ఇక రాజా, ఆదర్శ్, నవీన్ తదితరులు హీరో స్నేహితుల పాత్రల్లో చక్కగా నటించారు. దర్శకుడు సుధీర్ వర్మ ఇలాంటి రివేంజ్ డ్రామా, మాఫియా బ్యాక్ డ్రాప్ సినిమానే ఎందుకు చేయాలనుకున్నాడో కానీ.. కథలో మాత్రమే కాదు.. సన్నివేశాల్లోనూ కొత్తదనం కనపడదు. రొటీన్‌గా అనిపిస్తుంది. ఎమోషన్స్ గొప్పగా పండలేదు. హీరో భార్య చనిపోయి ఏడిచే స్థితిలో కూడా కన్నీరు కార్చడంటే అర్థం చేసుకోవచ్చు. హీరో, డాన్‌గా ఎదిగే క్రమాన్ని, భార్య హత్యకు ప్రతీకారం తీర్చుకునే సన్నివేశాలను చాలా సినిమాల్లో చూసేశాం. ప్రశాంత్ పిళ్లై సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ బావుంది. ఇక హీరో పాస్ట్, ప్రెజెంట్ సిట్యువేషన్స్‌ను మిక్స్ చేసి స్క్రీన్ ప్లే రన్ చేసిన విధానం బావుంది.

చివరగా.. రణరంగం.. ఓ వ్యక్తి పయనం

Read Ranarangam Review in English

Rating : 3.0 / 5.0