నటుడిగా అన్ని పాత్రలు చేయాలని ఉంది - రానా
- IndiaGlitz, [Saturday,April 21 2018]
నటుడు అంటే.. అన్ని పాత్రలు చేయాలి. ఒకే పాత్రలో, ఒకే ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోవడం తనకు ఇష్టం లేదని అంటున్నారు దగ్గుబాటి రానా. అందుకే.. ‘బాహుబలి’ లాంటి చిత్రంలో ప్రతినాయక పాత్రతో మెప్పించినా.. ‘ఘాజీ’లో నావెల్ ఆఫీసర్‌గా కనిపించినా.. ఇప్పుడు ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’ కోసం థానోస్ లాంటి విలన్‌కి డబ్బింగ్ చెప్పినా.. అది రానాలోని వైవిధ్యానికి అద్దం పడుతోంది. ఇటీవల ఓ మీడియాతో రానా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
“ఒక రెగ్యులర్ హీరోగా ఒకే రకమైన పాత్రలు చేయడం నాకిష్టం లేదు. ఏదైనా కొత్తదనం ఉండే పాత్ర వస్తే.. మనస్పూర్తిగా ఆ పాత్రని చేయడానికి నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాను” అని అన్నారు. అలాగే.. “నేను వినోదాన్ని పంచే ప్రపంచంలో ఉన్నాను.. వినోదాన్ని పంచడం కోసం నాకు సినీ రంగమైనా, టీవీ రంగమైనా ఒకటే. ఆసక్తిని పెంచే కథలు, పాత్రలతో పాటు ప్రతిభ కల టెక్నీషియన్స్ కూడా ఉన్నప్పుడు.. నా కెరీర్‌కు కొంత రిస్క్ అయినా ఆ పని చేయడానికి నేను ఇష్టపడతాను” అని చెప్పారు. తాజాగా రానా.. థానోస్‌కి తెలుగు డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే.
పరిపూర్ణ శక్తిగల థానోస్‌కి నా శాయశక్తులా డబ్బింగ్ చెప్పడం జరిగింది. మొత్తం కథ అంతా థానోస్ కోణంలోనే చెప్పడం చాలా బాగుంది. ప్రపంచంలోనే విజయవంతమైన సంస్థతో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉంది. నేను మర్వెల్ కామిక్స్ చదువుతూ.. చూస్తూ పెరిగాను. నాకు తెలిసి ఐరన్ మాన్ గురించి చదవడం.. బహుశా నేను చూసిన తొలి సినిమా కూడా ఐరన్ మాన్ అనుకుంటా” అని తెలిపారు. “హీరో అయినా, విలన్ అయినా దానికొక క్యారెక్టర్ ఉంటుంది. నేను ఆ క్యారెక్టర్‌లో ఉండి పని చేయాలనుకుంటా.. దాన్ని నేను బాగా ఎంజాయ్ చేస్తా.. అది ‘బాహుబలి’ అయినా.. థానోస్ అయినా సరే” అంటూ పేర్కొన్నారు. కాగా.. రానా డబ్బింగ్ చెప్పిన ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’ ఏప్రిల్ 27న విడుదల కానుంది.