Ramoji Rao:రామోజీరావుకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ.. మార్గదర్శి కేసులో సంచలన తీర్పు..

  • IndiaGlitz, [Wednesday,April 10 2024]

లోకం మొత్తానికి నీతులు చెప్పే ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు తాను మాత్రం నీతిమాలిన పనులు చేస్తుంటారు. వ్యవస్థలకు.. చట్టాలకు తాను అతీతుడినని భ్రమల్లో బతుకుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో మార్గదర్శి సంస్థ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్ల రూపాయలు డిపాజిట్ల రూపంలో సేకరించడమే కాకుండా చిట్ పాటదారులకు సైతం డబ్బులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ఈ క్రమంలో మార్గదర్శి చిట్స్ మీద కోర్టుల్లో పలు కేసులు విచారణలో ఉన్నాయి. ఈ క్రమంలోనే మార్గదర్శికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

మార్గదర్శి సంస్థపై విచారణను కొట్టివేస్తూ.. గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని.. తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి డిపాజిట్ల కేసు రిఫర్ చేస్తున్నట్టు తీర్పు వెల్లడించింది. మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా గత వాదనల ఆధారంగా కీలక తీర్పు వెల్లడించింది.

‘డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలి. పబ్లిక్ నోటీసు ఇచ్చి.. ఇంకా ఎవరైనా డిపాజిటర్లకి డబ్బు ఇంకా తిరిగి ఇవ్వలేదా? అనేది తెలుసుకోవాలి. ఇందుకు గానూ హైకోర్టు మాజీ జడ్జి ఒకరిని నియమించాలి. ఏపీలో కూడా డిపాజిటర్లు ఉన్నారు కాబట్టే అనుమతి ఇచ్చాం. మేము మెరిట్స్‌లోకి వెళ్ళడం లేదు. అందుకే తెలంగాణ హైకోర్టుకు రిఫర్ చేస్తున్నాం. రెండు మూడు నెలల్లో డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరపాలి. రిజర్వ్ బ్యాంక్ కూడా ఈ ప్రక్రియల్లో పాలు పంచుకోవాలి. ఇందుకు ఉండవల్లి అరుణ్ కుమార్ సహకరించాలి. తెలంగాణ, ఏపీ ప్రభుత్వం, ఆర్బీఐ, ఉండవల్లి ఈ కేసులో వాదనలు వినిపించాలి. ఆరు నెలల్లో ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టు పూర్తి చేయాలి. ఈ కేసుపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం. తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించండి అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పుతో రామోజీరావుకు పెద్ద చుక్కెదురైంది.