Atluri Rammohan Rao: రామోజీ ఫిల్మ్ సిటీ మాజీ ఎండీ అట్లూరి రామ్మోహన్ రావు కన్నుమూత... ప్రముఖుల సంతాపం
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్‌లోని ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అట్లూరి రామ్మోహన్ రావు కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న రామ్మోహన్ రావు శనివారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 1935లో కృష్ణాజిల్లా పెదపారుపూడిలో అట్లూరి రామ్మోహన్ రావు జన్మించారు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు ఆయన బాల్య స్నేహితుడు, సహాధ్యాయి.
ఇది అట్లూరి ప్రస్థానం:
విద్యాభ్యాసం తర్వాత ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన రామ్మోహన్ రావు అంచెలంచెలుగా ఎదిగారు. రామోజీరావు ఈనాడు దినపత్రికను స్థాపించడంతో... 1975లో ఆ సంస్థలో చేరి, 1978లో ఈనాడు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1982లో ఈనాడు ఎండీ స్థాయికి చేరుకుని, 1995 వరకు ఆ పదవిలో కొనసాగారు. రామోజీరావు మానసపుత్రికగా గుర్తింపు తెచ్చుకున్న రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంలో రామ్మోహన్ రావు కీలక పాత్ర పోషించారు. 1995లో రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి... సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. వయసు రీత్యా ఇటీవలే అట్లూరి పదవీ విరమణ చేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో రామ్మోహన్ రావు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.
అట్లూరికి ప్రముఖుల సంతాపం:
రామోజీ ఫిల్మ్ సిటీ మాజీ ఎండీ అట్లూరి రామ్మోహన్ రావు మృతిపట్ల తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ.. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments