Ram Charan : రామ్ చరణ్‌కు మరో ప్రతిష్టాత్మక పురస్కారం .. ‘పాప్ గోల్డెన్ అవార్డ్’ అందుకున్న మెగా హీరో
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. ఫైట్లు, డ్యాన్స్, నటనలో తండ్రికి తగ్గ కొడుకుగా గుర్తింపు తెచ్చుకున్నారు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్. అంతేకాదు ... సామాజిక సేవలోనూ చిరంజీవికి ఏమాత్రం తీసిపోనని నిరూపించుకుంటున్నారు. తండ్రి అడుగుజాడల్లో తన కెరీర్‌ను జాగ్రత్తగా నిర్మించుకుంటూ వస్తున్న ఆయన.. మెగా పవర్ స్టార్‌గా ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయారు. ఇంతకంటే ఒక తండ్రికి పుత్రోత్సాహం ఏముంటుంది. కొడుకును చూసి తాను ఎంతో గర్వంగా ఫీల్ అవుతానని పలుమార్లు వేదికలపై చెప్పారు చిరు.
కెరీర్లో ఎన్నో ఘనతలు అందుకున్నారు రాంచరణ్. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ క్రేజ్ గ్లోబల్ రేంజ్‌కి ఎదిగింది. నాటు నాటు సాంగ్ హిట్ కావడం, దానికి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ రావడంతో హాలీవుడ్‌లోనూ చెర్రీ పేరు మారుమోగిపోయింది. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరైన్ సహా దిగ్గజ దర్శకులు సైతం చరణ్ యాక్టింగ్‌కు ఫిదా అయిపోయారు. నిన్న గాక మొన్న అంతర్జాతీయ ఓటీటీ సంస్థ నెట్ఫ్లెక్సీ సీఈవో చరణ్ ఇంటికి స్వయంగా రావడం విశేషం. అలాగే గ్లోబల్ స్టార్‌కి ఇప్పటికే ఎన్నో అవార్డులు వచ్చాయి. ప్రతిష్టాత్మక ఆస్కార్ అకాడమీ బ్రాంచ్‌లో స్థానం సంపాదించుకున్నారు. అకాడమీ నుంచి గత నెలలో లేటెస్ట్గా విడుదలైన యాక్టర్స్ బ్రాంచ్ కొత్త లిస్టులో చరణ్ పేరు ప్రకటించారు.
తాజాగా రామ్‌చరణ్ ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డ్ వచ్చి చేరింది. అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్‌లో చరణ్‌కు ‘‘ గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డ్’’ దక్కింది . ఈ విషయాన్ని పాప్ గోల్డెన్ అవార్డ్స్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. ఈ పురస్కారం కోసం షారుఖ్ ఖాన్, ఆదా శర్మ, విషెస్ బన్సల్, అర్జున్ మాథుర్, దీపికా పదుకొణే, రిద్ధి డోగ్రా, రాశి ఖన్నా తదితరులు పోటీపడ్డారు. వీరందరినీ వెనక్కినెట్టి రామ్‌చరణ్ గోల్డెన్ బాలీవుడ్ అవార్డ్‌ను సొంతం చేసుకున్నారు. దీంతో చెర్రీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే .. రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ దర్శక దిగ్గజం శంకర్‌తో ‘‘గేమ్ ఛేంజర్’’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్ విలన్‌గా నటిస్తున్నారు. ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరామ్, సునీల్, అంజలి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘‘గేమ్ ఛేంజర్’’ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments