'రామాయణం' రాస్తూనే ఉన్నారు
- IndiaGlitz, [Monday,August 26 2019]
'రామాయణం' గురించి రోజుకొక వార్త వినిపిస్తూనే ఉంది. రాముడిగా హృతిక్ రోషన్ ఖరారయ్యారనీ, నాయికగా దీపిక పదుకోన్ నటిస్తున్నారనీ... ఇంకా చాలా చాలా అన్నమాట. ఇవాళ్రేపు మామూలు సినిమాలకే బోలెడన్ని గాసిప్పులు హల్ చల్ చేస్తుంటే, రామాయణం లాంటి సినిమాకు గాసిప్పులు ఉండవా? అదీ రూ.500కోట్ల చిత్రమాయే. దక్షిణాది చిత్ర సీమనూ, ఉత్తరాది సీమనూ ఏకం చేస్తూ చేస్తున్న ప్రాజెక్ట్ ఆయే... అందుకే అన్ని గాసిప్పులు వినిపిస్తూ ఉంటాయి మరి.
గీతా ఆర్ట్స్ సంస్థ అధినేత అల్లు అరవింద్, నిర్మాత మధు మంతెన, ప్రైమ్ ఫోకస్ నమిత్ మల్హోత్రా కలిసి నిర్మిస్తున్న చిత్రం 'రామాయణం'. ఈ రామాయణం కోసం ఇప్పటికే అల్లు అరవింద కార్యాలయంలో ఎన్నో వెర్షన్ల రామాయణాలను సేకరించి, వాటిలో విషయాలను, ముఖ్యమైన ఘట్టాలను పరిశీలిస్తున్నారట. రూ.500 కోట్లతో తెరకెక్కనున్న ఈ మూడు భాగాల చిత్రాన్ని, ఎవరి నేటివిటీకి తగ్గట్టు వారికి అనిపించేలా ఉండాలన్నది కూడా ప్లాన్. అంటే సర్వత్రా ఆమోగ్యకరమైన కథను ప్రిపేర్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకే తాజా 'రామాయణం' ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉంది.
స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత, దానికి పక్కా స్క్రీన్‌ప్లే రాసుకుని, అప్పుడు కేరక్టర్లను అనుకుని, ఆ కేరక్టర్లకు సరిపోయే వారిని ఇద్దరు ముగ్గురిని సెలక్ట్ చేసుకుని, వారిలో ఫైనల్ లిస్టును ఎంపిక చేస్తారని టాక్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తనకు అర్జునుడిగా నటించాలని ఉందని ప్రభాస్ లాంటివారు కూడా ఆల్రెడీ చెప్పారు. ఎటూ విలువిద్యను నేర్చుకున్నాడు కాబట్టి, ప్రభాస్ లాంటి వ్యక్తులను కూడా కన్సిడర్ చేస్తారని భావించవచ్చు.
నితీష్ తివారి, రవిఉడయార్ కలిసి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. దర్శకులకు సన్నిహితులు మాట్లాడుతూ ''రామాయణం ఇంకా రాతల స్టేజ్‌లోనే ఉంది. ఇంకా నటీనటుల గురించి ఏమీ అనుకోలేదు'' అని అన్నారు. మూడు భాగాలుగా తెరకెక్కే ఈ చిత్రాన్ని 2021కిగానీ విడుదల చేయడానికి స్కోప్ లేదు.