సినీ ఇండ‌స్ట్రీ గురించి రామ్ ట్వీట్‌

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్న ప‌లు రంగాల్లో సినీ పరిశ్ర‌మ ముందు వ‌రుస‌లో ఉంది. థియేట‌ర్స్ మూత‌ప‌డ‌టం, షూటింగ్స్ లేక‌పోవ‌డం వంటి కార‌ణాలతో సినీ ప‌రిశ్ర‌మ స్తంభించింది. దీంతో విడుద‌ల‌కు సిద్ధ‌మైన ప‌లు సినిమాల విడుద‌ల‌లు ఆగిపోయాయి. దీంతో ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌లు త‌మ ఫ్లాట్‌ఫామ్స్ పరిధిని పెంచుకోవ‌డానికి విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం ప్రారంభించారు. ఓ మోస్త‌రు బ‌డ్జెట్‌లో రూపొందిన ప‌లు సినిమాలను ఓటీటీలోనే రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు ఓకే అనుకుని ముందుకు వ‌చ్చారు.

ఈ క్ర‌మంలో ఓటీటీ బిజినెస్‌పై హీరో రామ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. ‘‘సినీ ఇండస్ట్రీలో ఓ విష‌యం ఉంది. సినిమా కొంద‌రికీ ప్యాష‌న్‌. చాలా మందికి అదే సినిమా వ్యాపారం. మిగిలిన వారంద‌రికీ అదొక ఆట‌. ఎవ‌రి దృష్టితో వారు దాన్ని చూస్తుంటారు’’ అన్నారు రామ్‌. ఈయ‌న హీరోగా న‌టించిన రెడ్ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తే క‌రోనా ప్ర‌భావంతో సినిమా విడుద‌ల ఆగింది. ఈ త‌రుణంలో సినిమా ఓటీటీలో విడుద‌ల‌వుతుంద‌ని వార్త‌లు వినిపించాయి. అయితే రామ్ ఈ వార్త‌ల‌ను ఖండించారు. త‌న రెడ్ సినిమా థియేట‌ర్స్‌లోనే విడుద‌ల‌వుతుంద‌ని ఆయ‌న ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.