నితిన్ బాటలోనే రామ్

  • IndiaGlitz, [Thursday,March 15 2018]

ఎవ‌రైనా స‌క్సెస్ ఇచ్చిన కాంబినేష‌న్‌తోనే వ‌రుస‌గా రెండో సినిమా కూడా చేస్తారు. అయితే ప్ర‌స్తుతం ఇద్ద‌రు యువ క‌థానాయ‌కులు అందుకు భిన్నంగా వెళుతున్నారు. ఆ యువ క‌థానాయ‌కులు మ‌రెవ‌రో కాదు.. నితిన్‌, రామ్‌. గ‌తేడాది 'లై' చిత్రంలో త‌న‌కు జోడీగా న‌టించిన మేఘా ఆకాష్‌తో 'ఛ‌ల్ మోహ‌న్ రంగ' అంటూ వెను వెంట‌నే మ‌రో సినిమా చేస్తున్నాడు నితిన్. 'లై' చిత్రం ఫ్లాప్ అయినా.. ఆమెకు నితిన్ మ‌రో అవ‌కాశం ఇవ్వ‌డం వార్త‌ల్లో నిలిచింది.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు నితిన్ బాట‌లోనే మ‌రో హీరో రామ్ కూడా వెళుతున్నారు. గ‌తేడాది 'ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ'లో త‌న‌కు జోడీగా న‌టించిన కేర‌ళ‌కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో త‌న త‌దుప‌రి చిత్రం 'హ‌లో గురు ప్రేమ కోస‌మే' చేస్తున్నాడు రామ్‌. 'ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ' ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా.. అనుప‌మ‌తో రామ్ వెనువెంట‌నే మ‌రో సినిమా చేయ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది. తొలిసారి క‌లిసి న‌టించిన‌ప్పుడు క‌లిసిరాని క‌థానాయిక‌ల‌తో.. వ‌రుస‌గా రెండో సారి సినిమాలు చేస్తున్న ఈ యువ క‌థానాయ‌కుల‌కు రెండో సారైనా విజ‌యం ల‌భిస్తుందేమో చూడాలి.