ఆర్జీవీ 'వ్యూహం' టీజర్.. వైఎస్సార్ మరణం తర్వాత ఏం జరిగింది, ఏపీ పాలిటిక్స్‌లో హీట్ తప్పదా..?
- IndiaGlitz, [Saturday,June 24 2023]
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను టార్గెట్ చేశారు. గతంలో 2019 ఏపీ ఎన్నికల సమయంలో ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ సినిమా తీసి సంచలనం సృష్టించిన ఆయన.. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వ్యూహం, శపథం అంటూ రెండు భాగాలుగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. తొలి భాగంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన ఘటనలు, రెండో భాగంలో జగన్ ఎలా సీఎం అయ్యాడు, అందుకు దారి తీసిన కారణాలను చూపించనున్నారు ఆర్జీవీ.
పాత్రల ఎంపికతోనే సగం గెలిచేసిన ఆర్జీవీ :
ఇక మెరుపు వేగంతో షూటింగ్‌ను కంప్లీట్ చేయడంలో దిట్ట అయిన వర్మ.. వ్యూహం సినిమాను వేగంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే సినిమాలోని పాత్రధారుల్ని కూడా పరిచయం చేశారు. వైఎస్ జగన్ పాత్రలో తమిళ నటుడు అజ్మల్ అమీర్, భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటిస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ముఖ్యంగా మానస రాధాకృష్ణన్ అచ్చుగుద్ధినట్లు వైఎస్ భారతిని దించేశారు. ఆ అమ్మాయి కట్టు బొట్టు, హావాభావాలు భారతిని తలపించాయి.
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో కట్టిపడేసిన వర్మ:
తాజాగా వ్యూహం నుంచి టీజర్‌ను వదిలారు మేకర్స్. 2009 సెప్టెంబర్ 2న వైఎస్సార్ హెలికాఫ్టర్ మిస్ అవ్వడంతో టీజర్ మొదలవుతుంది. వైఎస్ మరణించిన తర్వాత ఏం జరిగింది.. ఎవరెవరు ఎలా రియాక్ట్ అయ్యారు. మహానేత మరణంతో గుండెబద్ధలై పలువురు మరణించడం, జగన్ ఓదార్పు యాత్ర, జగన్‌ని అరెస్ట్ చేయడం , ఆయన వైసీపీని స్థాపించడం వంటి సన్నివేశాలను చూపారు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో వదిలిన ఈ టీజర్ చివరిలో .. ‘‘ నేనలా చేయడానికి చంద్రబాబున అనుకున్నావా’’ అని జగన్ పాత్ర చెబుతుంది. టీజర్‌లో జగన్, భారతి, విజయమ్మ, రోశయ్య, చంద్రబాబు తదితర కీలక పాత్రలను చూపించారు. మొత్తానికి తన మార్క్ టేకింగ్‌తో ‘‘వ్యూహం’’పై అంచనాలు పెంచేశారు ఆర్జీవీ. రామధూత క్రియేషన్స్ బ్యానర్‌పై వ్యూహం, శపథం రెండు భాగాలను దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. మరి ఈ రెండు భాగాలతో ఆర్జీవీ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తారో చూడాలి.