మెగా కోడలు ఉపాసనకు అరుదైన గౌరవం.. గోల్డెన్ వీసా ఇచ్చిన యూఏఈ, ఏంటీ దాని ప్రత్యేకత ..!!

మెగా కోడలు, అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్ ఉపాసన కామినేని.. భర్త రామ్‌చరణ్‌కు చేదోడువాదోడుగా వుంటారు. సినిమాలు, షూటింగ్‌లతో చెర్రీ బిజీగా వున్నప్పటికీ.. వ్యాపారాలు, కుటుంబ వ్యవహారాలను ఉపాసన చక్కదిద్దుతూ భర్తకు అండగా వుంటున్నారు. అంతేకాదు.. పలు సేవా కార్యక్రమాలను చేపడుతూ.. ఛారిటీలను నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా ఉపాసనకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మకమైన దుబాయ్ గోల్డెన్ వీసాను పొందారామె. యూఏఈ గోల్డెన్‌ వీసా పొందడం సంతోషంగా ఉందన్నారు ఉపాసన. తాను అన్ని దేశాల పట్ల అపారమైన గౌరవం, ప్రేమ కలిగిన భారతీయురాలిని అంటూ తన ఆనందాన్ని ట్విట్టర్‌లో తెలిపారు ఉపాసన.

ఇటీవల దుబాయ్‌లో 2020 ఎక్స్‌పోను ఉపాసన సందర్శించారు. అంతేకాకుండా అగ్‌మెంటెడ్‌ రియాలిటీ ద్వారా ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఉపాసన గోల్డెన్ వీసాను పొందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు భారతీయ ప్రముఖులు యూఏఈ గోల్డెన్ వీసాలు అందుకున్నారు. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, మలయాళ నటుడు మమ్ముట్టి, మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్, నటి త్రిష, గాయని చిత్ర ఇలా చాలా మంది గోల్డెన్ వీసా అందుకున్నారు.

ఈ గోల్డెన్ వీసాను యూఏఈ ప్రభుత్వం 2019 నుంచి జారీ చేస్తోంది. అయితే ఈ వీసాను అందరికీ ఇవ్వరు. సాహిత్యం, విద్య, కళలు, పరిశ్రమలకు సంబంధించిన వారికి మాత్రమే ఈ వీసా అందజేస్తారు. దీని సాయంతో దుబాయ్లో ఎటువంటి ఆంక్షలు లేకుండా నివసించవచ్చు. స్థానికులకు ఎలాంటి హక్కులు ఉంటాయో అలాంటి హక్కులు ఈ గోల్డెన్ వీసా పొందిన వారికి కూడా ఉంటాయి. అంతేకాదు ఇక్కడ వ్యాపారం చేసుకొవడానికి కూడా వారికి అనుమతి ఉంటుంది. 5 నుంచి 10 ఏళ్ల వరకు దీని కాలపరిమితి ఉంటుంది. అనంతరం ఆటోమోటిక్గా రెన్యూవల్ అవుతుంది.