రాజ‌మౌళితో మొద‌లుపెడుతున్న రామ్ చ‌ర‌ణ్‌

  • IndiaGlitz, [Thursday,March 01 2018]

క‌థానాయ‌కుడిగా రామ్ చ‌ర‌ణ్ కెరీర్ మొద‌లై ప‌దేళ్ళు దాటింది. ఈ ప‌దేళ్ళ కాలంలో హీరోగా ప‌ది సినిమాలతో సంద‌డి చేశాడు చ‌ర‌ణ్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 11 వ చిత్రం రంగ‌స్థ‌లం.. మార్చి 30న విడుద‌ల కానుంది. ఇక 12వ చిత్రంగా బోయ‌పాటి శ్రీ‌నుతో చేస్తున్న మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ ద‌స‌రాకి విడుద‌ల కానుంది.

ఈ చిత్రం త‌రువాత రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో సినిమా చేయ‌నున్నాడు చ‌ర‌ణ్‌. మ‌ల్టీస్టార‌ర్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌తో పాటు ఎన్టీఆర్ కూడా క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. రాజ‌మౌళితో చేస్తున్న సినిమా రామ్ చ‌ర‌ణ్‌కు ప్ర‌త్యేకం అనే చెప్పాలి. ఎందుకంటే.. ఇప్ప‌టివ‌ర‌కు త‌ను హీరోగా న‌టించిన చిత్రాల‌లో ఏ ద‌ర్శ‌కుడితోనూ రెండోసారి సినిమాలు చేసిన వైనం లేదు.

రాజ‌మౌళి కాంబినేష‌న్‌తోనే ఇలా రెండో సారి సినిమా చేయ‌డం అనే అంశానికి శ్రీ‌కారం చుడుతున్నాడు చ‌ర‌ణ్‌. ఆ త‌రువాత సురేంద‌ర్ రెడ్డి, పూరీ జగ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా చేసే అవ‌కాశ‌ముంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. నాయ‌క్ త‌రువాత వి.వి.వినాయ‌క్ డైరెక్ష‌న్‌లో ఖైదీ నెం.150 చేసినా.. అది ఓ పాట‌లో త‌ళుక్కున మెరిసే అతిథి పాత్ర కావ‌డం గ‌మ‌నార్హం.