40 రోజుల పాటు మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ : అఖిల భారత చిరంజీవి యువత
- IndiaGlitz, [Saturday,July 15 2017]
ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి నిశ్చయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాదికి మరో ప్రత్యేకత కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం ఈ సంవత్సరంతో 40 వసంతాలు పూర్తవుతుంది. దీనిలో భాగంగా 40 రోజుల పాటు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ తో పాటు, పలు సేవా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. నిన్నటి ( జులై14) నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు మొదలయ్యాయి. అమెరికా లోని వాషింగ్ టన్ లో మొదటి రక్తదాన శిబిరం నిర్వహించి చిరంజీవి బర్త్ డే వేడుకలు ప్రారంభించారు. అలాగే ఇండియాలోని మొదటి రక్తదన శిబిరం విశాఖపట్టణం జిల్లా గాజువాక పట్టణంలో ప్రారంభించి అదే వేదిక వద్ద మెగాస్టార్ 40 వసంతాల వేడుకలను ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా అభిమానులను ఉద్దేశించి ఓ వీడియో ను కూడా విడుదల చేశారు. ఆ వీడియాలో రామ్ చరణ్ మాట్లాడుతూ, ' నాన్నగారి 40 సంవత్సరాల సినిమా కెరీర్ ఈ ఏడాదితో పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఎన్నో బ్లడ్ డోనేషన్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారని విన్నాను. అమెరికాలో 40, మిడిల్ ఈస్ట్, దుబాయ్, మస్కట్ లో 14, ఇండియాలో 400 బ్లడ్ క్యాంపులను ఏర్పాటు చేయడం చాలా స్ఫూర్తి దాయకంగా ఉంది. మేము ఊహించిన దాని కన్నా ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అమెరికాలోని ఆప్త ఆర్గనైజేషన్ ద్వారా చేయడం చాలా సంతోషంగా ఉంది. నాన్న గారు బ్లడ్ బ్రదర్స్ అని ఎందుకున్నారో? ఇప్పడు అర్ధమవుతుంది. ఈ సర్వీసులు ఇలాగే కొనసాగలని ఆశిస్తున్నాం. అందుకు మెగా ఫ్యామిలీ తరుపున అభిమానులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మా సహకారం అభిమానులకు ఎల్లప్పుడూ ఉంటుంది' అని అన్నారు.
ఈ వేడుకలను, సేవా కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాలన్నీ అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రమణం స్వామినాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.