వ్యాక్సినేషన్‌ సెంచరీ: మీ శ్రమ వల్లే ఇదంతా... ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కి రామ్‌‌చరణ్‌ కృతజ్ఞతలు

  • IndiaGlitz, [Saturday,October 23 2021]

అగ్రరాజ్యాలకే సాధ్యం కానీ అసాధ్యాన్ని భారతదేశం ఇటీవల 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. తద్వారా చైనా తర్వాత 100 కోట్ల డోసులు అందించిన రెండో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. దీనిపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ స్పందనను తెలియజేస్తోన్న సంగతి తెలిసిందే. వీరిలో సినీ సెలబ్రెటీలు కూడా ఉన్నారు. 100 కోట్ల టీకా డోసులు పూర్తి చేయడం దేశానికి గర్వకారణమని ఇటీవల సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా ఇండియా సాధించిన ఘనతపై స్పందించారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారిపై పోరులో కీలకంగా వ్యవహరిస్తోన్న ఫ్రంట్‌ లైన్‌ వారియర్లను ఆయన అభినందించారు.

గురువారం ఈ మేరకు ట్వీట్ చేసిన రామ్ చరణ్ తన స్పందనను తెలియజేశారు. ’భారత దేశం 100 కోట్ల వ్యాక్సినేషన్లను పూర్తి చేసుకుని ‘వ్యాక్సినేషన్‌ సెంచరీ’ అనే చారిత్రాత్మక ఘనతను సొంతం చేసుకుంది. ఇందుకోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్, వైద్య, ఆరోగ్య సిబ్బంది అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని చరణ్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

కాగా... రాజమౌళీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌తో రామ్ చరణ్ కలిసి నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ జనవరి 7న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక తమిళ దర్శక దిగ్గజం శంకర్‌ కాంబినేషన్‌లో రామ్‌చరణ్ నటిస్తున్న తాజా చిత్రానికి ఇటీవల పూణేలో కొబ్బరి కాయ కొట్టారు. తొలి షెడ్యూల్ దాదాపు 20 రోజుల పాటు సాగనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ యువ ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారని ఫిలింనగర్ టాక్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా .. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.