Rangasthalam:జపాన్‌లో 'రంగస్థలం' ప్రభంజనం ... చరణ్ నటనకు జపనీయులు ఫిదా, తొలి రోజే దిమ్మ తిరిగే వసూళ్లు

  • IndiaGlitz, [Sunday,July 16 2023]

రంగస్థలం. రామ్‌చరణ్ జీవితంలో ఓ మెమొరబుల్ మూవీ. నటన విషయంలో తనను విమర్శిస్తున్న వాళ్లకు సింగిల్ స్ట్రోక్‌తో సమాధానమిచ్చారు చరణ్. నటన , డ్యాన్సులు, ఫైట్స్ విషయంలో కొత్త చెర్రీని చూపించారు. రామ్ చరణ్ సినీ జీవితాన్ని రంగస్థలానికి ముందు .. రంగస్థలానికి తర్వాత అన్నట్లుగా చెబుతారంటే ఈ సినిమా ఆయన కెరీర్‌పై ఎలాంటి ముద్ర వేసిందో చెప్పవచ్చు. క్రియేటివ్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2018లో విడుదలై దాదాపు రూ.216 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సంచనలం సృష్టించింది. సుకుమార్ టేకింగ్, చరణ్ యాక్టింగ్, సమంత అందానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

జపాన్‌లో 70 స్క్రీన్‌లలో విడుదలైన రంగస్థలం :

ప్రస్తుతం భారతీయ సినిమా నానాటీకి తన విస్తృతిని పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఏ యేటికాయేడు కొత్త కొత్త మార్కెట్లను వెతుకుతూ ముందుకు సాగుతోంది. చైనా, జపాన్‌లలోనూ మన సినిమాలు దుమ్మురేపుతూ కలెక్షన్ల పంట పండిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్‌తో చరణ్ ఫాలోయింగ్ జపాన్‌లో మరింత పెరిగింది. ఇక్కడి అభిమానులు, ఇండస్ట్రీ విజ్ఞప్తి మేరకు రంగస్థలం సినిమాను జపాన్‌లో రిలీజ్ చేశారు. విడుదలైన తొలి రోజే రంగస్థలం దుమ్మరేపింది. 2.5 మిలియన్ల యెన్‌లను వసూలు చేసి చిట్టిబాబు సత్తా చాటాడు. జపాన్‌లో రంగస్థలాన్ని 70 స్క్రీన్‌లలో విడుదల చేశారు. ఈ కలెక్షన్ల ద్వారా జపాన్‌లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రంగస్థలం నిలిచింది.

స్క్రీన్లు పెంచుతామన్న పంపిణీ సంస్థ :

దీనిపై రంగస్థలాన్ని జపాన్‌లో విడుదల చేసిన పంపిణీ సంస్థ స్పేస్‌బాక్స్ సీఈవో అన్బరసి దురైపాండియన్ మాట్లాడుతూ.. జపాన్ ప్రజల గుండెల్లో రామ్‌చరణ్‌కు ప్రత్యేక స్థానం వుందన్నారు. రంగస్థలం విడుదలకు వచ్చిన స్పందనే దీనికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో స్క్రీన్ల సంఖ్యను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. ఈ సినిమా నిజంగా ఒక మాస్టర్ పీస్ అని, రంగస్థలాన్ని జపాన్‌లో విడుదల చేసినందుకు స్పేస్‌బాక్స్‌కు గర్వంగా వుందన్నారు. ఇక స్పేస్ బాక్స్ విషయానికి వస్తే.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలకు చెందిన దాదాపు 250 భారతీయ చిత్రాలను ఈ సంస్థ జపాన్‌లో పంపిణీ చేసింది.