'దర్శకుడు' ఆడియో విడుదల చేసిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్
- IndiaGlitz, [Sunday,July 16 2017]
సుకుమార్ నిర్మాతగా మారి సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి నిర్మిస్తున్న చిత్రం 'దర్శకుడు'. అశోక్, ఈషా జంటగా నటిస్తున్నారు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 4న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సీడీని రామ్‌చరణ్ విడుదల చేయగా, సుకుమార్ తొలి సీడీని స్వీకరించారు. ప్రముఖ దర్శకులు వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా...
నా సినీ జర్నీ ఇంత బాగా సాగుతుందంటే కారణం నా దర్శకులే
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ - ''మనకు నచ్చిన వ్యక్తుల గురించి మనం రోజూ మాట్లాడుకోం. ఉదాహరణకు మన అమ్మ గురించి రోజూ మాట్లాడుకోం. ఆమె పక్కనుంటే చాలు. ఏదైనా మనసులో ఉండాలి. మాటల్లో కాదు. అలాగే నా ఫ్యామిలీ కూడా నా మాటల్లో తక్కువగానే కనపడుతుంది. కానీ నా గుండెల్లో ఎప్పుడూ ఉంటుంది. మమ్మల్ని ఆదరిస్తున్న అభిమానులందరికీ థాంక్స్. నాకు దర్శకుడు అనే పేరు వినగానే గుర్తుకొచ్చే రెండు పేర్లలో ముందు దాసరి నారాయణరావుగారైతే, రెండో పేరు రాఘవేంద్రరావుగారు. వీరిద్దరిని చూసి ఇన్‌స్ఫైర్ కానీ దర్శకుడెవరు ఉండి ఉండరనుకుంటాను. సుకుమార్‌గారు నా అభిమాన దర్శకుడు. తక్కువ రోజుల్లో చాలా బాగా నచ్చేసిన వ్యక్తి సుకుమార్. దర్శకుడు అనే టైటిల్ పెట్టడమే కొత్తదనం. దాని వల్ల వచ్చే చాలెంజెస్ ఏంటో కూడా నాకు తెలుసు. సినిమా ఎలా తీసి ఉంటారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సుకుమార్‌గారు తన పేరుపై ఓ బ్యానర్‌ను స్టార్ట్ చేసి కొత్త దర్శకులను పరిచయం చేస్తున్నందుకు తనను అభినందిస్తున్నాను. తన మల్టీ టాలెంటెడ్‌గా అన్ని పనులు చేస్తున్నాడు. నేను కూడా నాన్నగారి ఖైదీ నంబర్ 150తో నిర్మాతగా మారాను.
అలాగే నాన్నగారి నెక్స్‌ట్ మూవీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా చేయబోతున్నాను. ఓ ప్రొడ్యూసర్‌కు ఎంత ఒత్తిడి ఉంటుందో నాకు తెలుసు. ఆ కష్టం నాకు తెలుసు. అంత కష్టంలో ఉన్నా కూడా దర్శకుడిగా తన వర్క్‌ను చేసుకుంటూ పోతున్నారు. ఈ సినిమా ఓ డైరెక్టర్ జర్నీ. లవ్ లేకపోతే సుకుమార్ లేదు. సుకుమార్ రాస్తే లవ్ లేకుండా ఉండదు. తన మొదటి సినిమా నుండి ఈ సినిమా వరకు మనం అది చూసుంటాం. ఆయన ఏ కథ రాసినా బలమైన లవ్ పాయింట్‌తో కథ రాసుంటారని భావిస్తున్నాను. దర్శకుడు హరిప్రసాద్‌గారికి అభినందనలు. అశోక్‌కు అభినందనలు. సాయికార్తీక్ చాలా బాగా, యూత్‌ఫుల్‌గా మ్యూజిక్ ఇచ్చారు. తనతో భవిష్యత్‌లో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. మొన్ననే పెళ్ళిచూపులు, అమీతుమీ సినిమాలను కుటుంబమంతా కలిసి చూశాం. సినిమాలను బాగా ఎంజాయ్ చేశాం. ఈ సందర్భంగా ఇద్దరి దర్శకులకు అభినందనలు. ఈరోజు ఇలా మీ అందరి మధ్యలో నిలబడి మాట్లాడుతున్నానంటే కారణం నా దర్శకులే. నాన్నగారు నాకు ఓ ప్లాట్‌ఫాం ఇచ్చినా, నా దర్శకులే, ఆ ప్లాట్‌ఫాంను బలంగా నిలబెట్టారు. కాబట్టి వారందరికీ స్పెషల్ థాంక్స్'' అన్నారు.
చరణ్ మట్టి మనిషి
సుకుమార్ రైటింగ్స్ అధినేత, డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ - ''నా దర్శకుడు సినిమా ఆశీర్వదించడానికి చాలా మంది దర్శకులు, నిర్మాతలు రావడం ఆనందంగా ఉంది. నేను, బివిఎస్ఎన్ ప్రసాద్ తండ్రి కొడుకుల్లా ఉంటాం. అలాగే పివిపిగారు కూడా నాకు మంచి స్నేహితులయ్యారు. మేఘాలతో సెట్ వేస్తా అనే సాంగ్‌ను దర్శకులందరి కోసం చేశాను. ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. సుధీర్‌వర్మ, చందు మొండేటిలను నా అసిస్టెంట్ దర్శకుల్లా ఫీల్ అవుతుంటాను. నేను ఇండస్ట్రీలోకి వచ్చే కొత్తలో దశరథ్ పేరు బాగా వినపడేది. తనను కలిశాను. తను పాషనేట్ నాకు అర్థమైంది. వాసువర్మతో ఆర్య సినిమా నుండి పరిచయం ఉంది. ఆర్యలో నన్నెంతో ఇన్‌స్ఫైర్ చేశాడు. అలాగే సురేందర్ నాకు ఇండస్ట్రీలో నిజమైన స్నేహితుడు. ఇద్దరం ఒకేసారి ప్రయాణాన్ని స్టార్ట్ చేశాను.
మా ఇద్దరి తొలి సినిమాలు సూపర్‌హిట్ అయ్యాయి. సురేందర్ మంచి నెరేటర్. ఇక వంశీ పైడిపల్లితో ఆర్య సినిమా నుండి మంచి పరిచయం ఉంది. ఇలా అందరు దర్శకులు నాకు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థాంక్స్. రామ్‌చరణ్‌కు చాలా పెద్ద థాంక్స్. నేను అడగ్గానే ఈ వేడుకకి రావడానికి పుట్టారు. రంగస్థలం 1985లో తనతో ఎలా సినిమా చేయాలని ఆలోచించాను. తను చిరంజీవిగారి అబ్బాయిగా పుట్టి ఉండొచ్చు కానీ తను మట్టి మనిషి. కాఫీలో బెల్లం కలుపుకుని తాగే బాపతు. తను హీరోస్ అందరిలో చాలా నేచురల్. డౌన్ టు ఎర్త్ పర్సన్. మా డైరెక్టర్ హరిప్రసాద్ ఫిజిక్స్ లెక్చరర్. నాకు మంచి దోస్త్. నేను ఒకానొక సమయంలో మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు నాకు అండగా నిలబడి ఎంతో సపోర్ట్ చేశారు. తను ఈ కథ చెప్పగానే తననే డైరెక్ట్ చేయమని చెప్పాను. తనకు దర్శకత్వ అనుభవం లేకపోయినా, ఈ సినిమాను ఓ అనుభవమున్న దర్శకుడిలా ఎంతో బాగా చేశాడు. అశోక్‌ను హీరో చేయాలనే తపన కూడా తనదే. దర్శకుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత తనను అందరూ దర్శకుడు హరిప్రసాద్ అంటారు. సాయికార్తీక్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. దేవి శ్రీ ప్రసాద్ కాకుండా నేను పనిచేసిన మరో మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్. నేను రూపాయి ఇస్తే, వంద రూపాలయ వర్క్ నాకు తిరిగి ఇచ్చాడు. థామస్, విజయ్‌కుమార్ అన్నయ్య, రవిచంద్రన్ సహా అందరికీ థాంక్స్'' అన్నారు.
కుటుంబమంతా కలిసే చూసే చిత్రమిది
చిత్ర దర్శకుడు హరి ప్రసాద్ జక్కా మాట్లాడుతూ - ''నేను ముందు డైరెక్షన్ చేయాలనుకోలేదు. సుకుమార్‌కు కథను వినిపించాను. కథ విన్న సుక్కు నువ్వే డైరెక్షన్ చేసెయ్ అన్నారు. అప్పటి నుండి నాలో కంగారు మొదలైంది. దర్శకుడిగా నాకు అనుభవం లేదు. ఎలా చేయాలో తెలియదు. అందుకని నేను మన టాలీవుడ్‌లో దర్శకులందరి తొలి సినిమాలు చూశాను. అన్ని సూపర్‌హిట్ సినిమాలే. అందుకు కారణం వారి వెనుక వారి కష్టంతో పాటు మంచి టెక్నికల్ టీం అండగా ఉంది. అందువల్ల నేను కూడా మంచి టెక్నిషియన్స్‌ను తీసుకోవాలని మ్యూజిక్ డైరెక్టర్‌గా సాయికార్తీక్, సినిమాటోగ్రాఫర్‌గా ప్రవీణ్‌ను, ఎడిటర్‌గా నవీన్ సహా అందరిని తీసుకున్నాను. అందరూ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. అశోక్, హీరోయిన్ ఈషా చక్కగా నటించారు. కుటుంబమంతా కలిసే చూసే చిత్రమిది'' అన్నారు.
కుమారి 21ఎఫ్‌లా హిట్ కావాలి
సురేందర్ రెడ్డి మాట్లాడుతూ - ''సుక్కు ఏ సినిమా చేసినా, నేను చేసినట్టే భావిస్తాను. తన సినిమా హిట్ అయినా,ప్లాప్ అయినా తనెలా ఫీల్ అవుతాడో అలాగే ఫీల్ అవుతాను. మా ఇద్దరి మధ్య రిలేషన్ అంత బావుంటుంది. మా ఇద్దరి జర్నీ ఒకేసారి స్టార్ట్ అయినా, తను నాకెంతో ఇన్‌స్పిరేషన్. కుమార్ 21 ఎఫ్‌లాగానే, ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలి. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్'' అన్నారు.
సినిమా చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ - ''ఆర్య సినిమా కంటే సుకుమార్ నాకు పరిచయం. ఓ మాస్టార్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన సుకుమార్ దర్శకుడు కావడం వరకు నాకు తెలుసు. కానీ తన పేరు మీద ఓ బ్యానర్ పెట్టి సినిమా చేయడం తన గట్స్‌కు నిదర్శనం. కుమారి 21 ఎఫ్ తో తన పేరు మీద బ్యానర్ స్టార్ట్ చేసి సక్సెస్ కొట్టాడు. తన డైరెక్షన్, స్క్రీన్‌ప్లే, మాటలకు మా అందరిలో ఓ రెస్పెక్ట్ ఉంది. సుక్కు దర్శకత్వంలో రామ్‌చరణ్‌గారు చేస్తున్న రంగస్థలం 1985 సినిమాలో ఓ సాంగ్ విన్నాను. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఉన్నాను. సినిమాలో నటించిన నటీనటులు, నిర్మాతలకు, దర్శకుడిగా థాంక్స్'' అన్నారు.
సాయికార్తీక్ మాట్లాడుతూ - ''దర్శకుడి సినిమాలో మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన సుకుమార్‌గారికి, నిర్మాతలకు థాంక్స్'' అన్నారు.
బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ - ''ఈ సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ అందరితో నాకు మంచి పరిచయం ఉంది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
పివిపి మాట్లాడుతూ - ''దర్శకుడిగా సుకుమార్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. నిర్మాతగా కూడా తను సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. దర్శకుడు హరికి ఈ సినిమా గ్రాండ్ వెల్‌కమ్ కావాలి'' అన్నారు.
సతీష్ వేగేశ్న మాట్లాడుతూ - ''దర్శకుడు నిర్మాతగా మారి, మరో దర్శకుడికి అవకాశం ఇస్తున్నారు సుకుమార్. థర్డ్ ప్రొవెకింగ్‌లో సుకుమార్ ముందు, తర్వాత అనేలా తను ఆలోచిస్తున్నాడు. తెలుగులో దాసరి నారాయణరావుగారి తర్వాత తన టీంలోని వారిని దర్శకులుగా మారుస్తున్నారు. ఇండస్ట్రీలో టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్న సుకుమార్‌గారికి, యూనిట్‌కు అభినందనలు'' అన్నారు.
సుధీర్ వర్మ మాట్లాడుతూ - ''సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో వచ్చిన కుమార్ 21ఎఫ్ చిత్రం కంటే ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
చందు మొండేటి మాట్లాడుతూ - ''ఆర్య సినిమా చూసి నేను ఇన్‌స్ఫైర్ అయ్యి ఈ ఇండస్ట్రీలోకి వచ్చాను. అలాంటి సుకుమార్‌గారు నిర్మాతగా చేస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలి'' అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ - ''సింగీతం శ్రీనివాసరావుగారు అవుటాఫ్ ది బాక్స్ సినిమాలు చేసే దర్శకుడు. ఆయన తర్వాత ఈ జనరేషన్‌లో అలా అవుటాఫ్ ది బాక్స్ సినిమా చేస్తారు. ఆయన దర్శకత్వంలో రానున్న రంగస్థలం 1985 కోసం ఎదురుచూస్తున్నాను. అలాగే సుకుమార్‌గారు నిర్మాతగా చేసిన కుమార్ 21 ఎఫ్ పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా కూడా అంతే పెద్ద హిట్ కావాలి. నా సినిమాలకు మ్యూజిక్ అందించిన సాయికార్తీక్ ఈ సినిమాకు మ్యూజిక్ చేశాడు. తనకు ఈ సినిమాతో మరో సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
కల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ - ''సుకుమార్‌గారు దర్శకత్వం చేసే సినిమాల్లోనే కాదు, ఆయన ప్రొడ్యూస్ చేసే సినిమాల్లో కూడా ఓ మ్యాజిక్ ఉంటుందని భావిస్తున్నాను. ఈ సినిమా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్'' అన్నారు.
వక్కంతం వంశీ మాట్లాడుతూ - ''సుకుమార్‌గారు నాకు ఫేవరెట్ డైరెక్టర్స్‌లో ఒకరు. థాట్ ప్రొవెకింగ్ డైరెక్టర్. కొత్త దర్శకులను పరిచయం చేస్తున్నారు. నేను డైరెక్ట్ చేస్తున్న సినిమాకు కూడా ఆయనెంతో సపోర్ట్ చేస్తున్నారు. డైరెక్టర్ హరి, నిర్మాత సుకుమార్‌కు, యూనిట్‌కు ఆల్ ది బెస్ట్. కుమార్ 21 ఎఫ్ కంటే ఈ దర్శకుడు సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ - ''ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్. కొత్త సినిమాగా కనపడుతుంది. ఇన్నోవేటివ్‌గా కనపడుతుంది'' అన్నారు.
హీరో అశోక్ మాట్లాడుతూ - ''సుకుమార్‌గారు ఆయన కంటే ఆయన పక్క నున్న వారి గురించి మంచిగా ఆలోచిస్తారు. ఆయనకు ఎందుకు ఆలోచన వచ్చిందో తెలియదు కానీ నన్ను హీరోను చేయాలనుకుని, మూడేళ్ళ పాటు నన్ను ట్రయిన్ చేసి ఈ సినిమా చేశారు. దర్శకుడు హరిప్రసాద్‌గారి, నిర్మాతలకు థాంక్స్'' అన్నారు.