Ram Charan - Allu Arjun: కోనసీమలో రామ్‌చరణ్.. రాయలసీమలో అల్లు అర్జున్ సందడి..
Send us your feedback to audioarticles@vaarta.com
ఈసారి ఏపీ ఎన్నికల్లో సినీ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరపున పిఠాపురంలో మెగా హీరోలు, జబర్దస్త్ నటులు, నిర్మాతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. మరోవైపు టీడీపీ తరపున నందమూరి బాలకృష్ణ, నారా రోహిత్.. బీజేపీ అభ్యర్థులు తరపున హీరో వెంకటేశ్, నటి నమిత ప్రచారం చేశారు. తాజాగా పవన్ కల్యాణ్‌కు మద్దతు ఇచ్చేందుకు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ పిఠాపురం వెళ్లారు. చేబ్రోలులోని పవన్ నివాసానికి వెళ్లిన అనంతరం చరణ్, పవన్.. బాల్కనీ నుంచి ప్రజలు, అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం సురేఖ, అల్లు అరవింద్ అంతా అభిమానులకు అభివాదం చేశారు.
దీంతో పవన్ నివాస ప్రాంగణం వద్ద సందడి నెలకొంది. అంతకుముందు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్న రామ్‌చరణ్, తల్లి సురేఖ, మామయ్య అల్లు అరవింద్‌తో కలిసి పిఠాపురం బయల్దేరారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్‌కు అభిమానులు, జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ముందుగా వీరంతా పిఠాపురంలోని శ్రీ పాదగయ క్షేత్రాన్ని సందర్శించారు. శక్తిపీఠం పురూహుతికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు వారికి శ్రీ చక్ర దర్శనం చేయించి వేద ఆశీర్వచనాలు అందించారు.
మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మిత్రుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా నంద్యాలకు వెళ్లారు. దీంతో బన్నీని చూసేందుకు అభిమానులు భారీగా తరలిచ్చారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ "శిల్పా రవి నాకు మంచి మిత్రుడు. నాకు పార్టీలతో సంబంధం లేదు. కేవలం శిల్పా రవితో ఉన్న వ్యక్తిగత స్నేహంతోనే నేను నంద్యాలకు రావడం జరిగింది. అతనితో నాకు, నా కుటుంబానికి ఉన్న అనుబంధమే నన్ను నంద్యాలకు వచ్చేలా చేసింది. ప్రజల కోసం కష్టపడుతున్న మనిషికి అండగా నిలవడానికి వచ్చాను. శిల్పా రవి మంచి మెజార్టీతో గెలుపొందాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు. దీంతో ఒకేరోజు మెగా కుటుబంబానికి చెందిన చెర్రీ, బన్నీ ఇటు రాయలసీమ.. అటు కోనసీమలో సందడి చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout