Ram Charan:'క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్' : బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నామినేట్ అయిన రామ్ చరణ్.. హాలీవుడ్ స్టార్స్‌కు ముచ్చెమటలు
- IndiaGlitz, [Thursday,February 23 2023]
తెలుగు చిత్ర పరిశ్రమ సత్తాను ప్రపంచానికి చాటిన ఆర్ఆర్ఆర్ మూవీ అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండిస్తోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ సహా అనేక పురస్కారాలను సొంతం చేసుకుని భారతీయ చిత్ర పరిశ్రమలో మరెవరికి సాధ్యం కానీ రీతిలో దూసుకెళ్తోంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అంతిమ లక్ష్యం ఆస్కార్. బెస్ట్ ఒరిజినల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వివాదంలో ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్ బరిలో నిలిచింది. దీంతో ఆస్కార్ ఖచ్చితంగా దక్కుతుందని యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే జక్కన్న తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కెమెరూన్‌తోనూ ఆయన మిలాఖత్ అయ్యారు. అటు మీడియా కంట్లో పడేందుకు కూడా లాబీయింగ్ చేస్తున్నారు. అటు చిత్ర యూనిట్ సైతం పేరున్న మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
హాలీవుడ్ సూపర్‌స్టార్స్‌తో పోటీపడనున్న ఎన్టీఆర్, చరణ్:
ఇదిలావుండగా ఆర్ఆర్ఆర్ మరో ప్రతిష్టాత్మక అవార్డుకు సంబంధించి రెండు కేటగిరీలలో అవార్డుకు నామినేట్ అయ్యింది. క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్‌లో రెండు కేటగిరీలకు ఆర్ఆర్ఆర్ నామినేషన్స్ దక్కించుకుంది. బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్ నామినేట్ అయ్యింది. అంతేకాదు.. ‘టాప్ గన్: మావెరిక్’, ‘బుల్లెట్ ట్రైన్’, ‘ది అన్‌బేరబుల్ వెయిట్ ఆఫ్ మాసివ్ టాలెంట్’, ‘ది ఉమెన్ కింగ్’ వంటి అంతర్జాతీయ చిత్రాలతో ఆర్ఆర్ఆర్ పోటీ పడాల్సి వుంది. వీటిలో నటించిన వారు ఆషామాషీ వ్యక్తులు కాదు.. హాలీవుడ్ సూపర్‌స్టార్స్ టామ్ క్రూజ్, బ్రాడ్‌పిట్, నికోలస్ కేజ్‌లు. వీరితో రామ్ చరణ్, ఎన్టీఆర్ తలపడనున్నారు. క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ తుది ఫలితాలు మార్చి 16న విడుదల కానున్నాయి.
1200 వందల కోట్ల వసూళ్లు సాధించిన ఆర్ఆర్ఆర్:
ఇదిలావుండగా.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ లో విశేషాలు బోలెడు. తెలుగు సినిమాను శాసించే రెండు పెద్ద కుటుంబాలకు చెందిన వారసులు కలిసి నటిస్తే చూడాలని కలలు కన్న వారికి దానిని నిజం చేసి చూపారు జక్కన్న. ఎన్టీఆర్ - రామ్‌చరణ్ హీరోలుగా నటించగా బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవ్‌గణ్, అలియా భట్‌లు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో దీనికి మరింత హైప్ వచ్చింది. శ్రీయా శరణ్, సముద్రఖని తదితరులు కీలకపాత్ర పోషించారు. మార్చి 24న రిలీజైన ఈ సినిమా సౌత్ , నార్త్ , ఓవర్సీస్ రికార్డులను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1,200 కోట్ల కలెక్షన్స్ సంపాదించి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల లిస్ట్‌లో చోటు దక్కించుకుంది.