Ram Charan:జీ 20 వేదికపై 'నాటు నాటు' సాంగ్ .. ప్రతినిధులతో కలిసి డ్యాన్స్ చేసిన రామ్ చరణ్

  • IndiaGlitz, [Tuesday,May 23 2023]

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్-ఎన్టీఆర్ హీరోలుగా నటించిన చిత్రం ‘‘ఆర్ఆర్ఆర్’’. ఈ సినిమాలోని ‘నాటు నాటు’కు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ లభించింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ‘అప్లాజ్‌’ (టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమెన్‌), ‘లిఫ్ట్‌ మి అప్‌’ (బ్లాక్‌ పాంథర్‌: వకాండా ఫెరవర్‌), దిస్‌ ఈజ్‌ ఎ లైఫ్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’, ‘హోల్డ్‌ మై హ్యాండ్‌’ (టాప్‌గన్‌ మావెరిక్‌) పాటలను వెనక్కి నెట్టి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్‌ను దక్కించుకుంది. దీంతో యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ పులకించిపోయింది.

జీ 20 వేదికను ఊపేసిన నాటు నాటు :

అంతేకాదు.. ప్రపంచం మొత్తం నాటు నాటుతో పూనకాలు వచ్చినట్లు ఊగిపోయింది. అనేక మంది ప్రముఖులు, సామాన్యులు నాటు నాటు సాంగ్‌కి స్టెప్పులు వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ ట్రెండ్ నేటికి కొనసాగుతూనే వుంది. తాజాగా జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరుగుతున్న జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్‌ సదస్సులోనూ ‘‘నాటు నాటు’’ సాంగ్ మారుమోగింది. వేదిక మీద ఈ సినిమా హీరో రామ్ చరణ్‌తో కలిసి జీ 20 ప్రతినిధులు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాశ్మీర్‌లో ఏదో మ్యాజిక్ వుందన్న చరణ్ :

కాగా.. శ్రీనగర్‌లో జరిగే ‘‘జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీట్’’లో పాల్గొనాల్సిందిగా రామ్ చరణ్‌కు ఆహ్వానం అందింది. మే 22 నుంచి మే 24 వరకు మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత తొలిసారిగా కాశ్మీర్‌లో ఈ స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామ్‌చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌ అద్భుతమైన ప్రదేశమని.. ఇక్కడికి రావడం తనకు ఇదే తొలిసారి కాదని.. 1986 నుంచి వస్తూనే వున్నానని చరణ్ తెలిపారు. తన తండ్రి చిరంజీవి ఇక్కడి గుల్‌మార్గ్, సోనామార్గ్‌లలో వివిధ చిత్రాల షూటింగ్‌లలో పాల్గొన్నారని ఆయన గుర్తుచేసుకున్నారు. తాను కూడా 2016లో ఈ ఆడిటోరియంలో జరిగిన షూటింగ్‌లో పాల్గొన్నట్లు చరణ్ తెలిపారు. ఈ ప్రాంతంలో ఏదో మాయ వుందన్న ఆయన కాశ్మీర్‌కు రావడం ఓ అనుభూతి అని ఇది అందరినీ ఆకర్షిస్తుందని చెప్పారు.