రామ్ చరణ్ నటనకి పదేళ్లు

  • IndiaGlitz, [Thursday,September 28 2017]

మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడుగా తెరంగేట్రం చేసిన‌ప్ప‌టికీ.. త‌న‌కంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్నాడు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌. చిరు త‌న‌యుడుగా 'చిరుత' పేరుతో సినిమా చేసి.. తెలుగు తెర‌పై తొలి అడుగులు వేసిన చ‌ర‌ణ్‌.. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే మంచి మార్కులు తెచ్చుకున్నాడు. తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్నాడు. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన రామ్‌చ‌ర‌ణ్ మొద‌టి సినిమా 'చిరుత' స‌రిగ్గా ఇదే సెప్టెంబ‌ర్ 28న విడుద‌లైంది. విశేషమేమిటంటే.. ద‌ర్శ‌కుడి పూరీ పుట్టిన‌రోజు కూడా అదే రోజు కావ‌డం.

సి.అశ్వ‌నీద‌త్ నిర్మించిన ఈ చిత్రంతో నేహా శ‌ర్మ క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతంలో అన్ని పాట‌లు సూప‌ర్ హిట్టే. 2007లో విడుద‌లైన 'చిరుత' నేటితో ప‌ది సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంటోంది. అంటే రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌న‌కి ప‌దేళ్లు పూర్త‌వుతున్నాయ‌న్న‌మాట‌. ప్రస్తుతం సుకుమార్‌తో 'రంగ‌స్థ‌లం' చేస్తున్న చ‌ర‌ణ్‌.. భ‌విష్య‌త్‌లో 'మ‌గ‌ధీర' లాంటి ఘ‌న‌విజ‌యాలు మ‌రిన్ని అందుకోవాల‌ని ఆకాంక్షిద్దాం.