Ram Charan-Upasana: సంప్రదాయానికి పెద్ద పీట.. స్త్రీ శక్తికి వందనం, వారితో కలిసి దసరా వేడుకల్లో చరణ్ దంపతులు
- IndiaGlitz, [Tuesday,October 24 2023]
పెద్దింట్లో పుట్టినా, గ్లోబల్ స్టార్‌గా ఎదిగినా రామ్ చరణ్ తన మూలాలను మరిచిపోలేదు. మోడ్రన్‌గా కనిపిస్తూనే, సాంప్రదాయాలకు సైతం విలువనిస్తారు చెర్రీ. అంతేకాదు.. ప్రతి పండుగను, ఇతర కార్యక్రమాలను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడం ఆయనకు అలవాటు. అలాగే ప్రతి ఏడాది అయ్యప్పమాల వేసుకోవడమే కాక.. ఆ సమయంలో నియమ నిష్టలతో ఉంటారు. షూటింగ్‌లో వున్నా సరే వ్రత నియమాలకు మాత్రం ఆయన భంగం కలిగించరు. తాజాగా ఆయన విజయదశమి వేడుకలను కుటుంబంతో కలిసి జరుపుకున్నారు.
బాలికా నిలయం సేవా సమాజ్‌కు అండగా నిలిచిన ఉపాసన బామ్మ:
ఈ వేడుకలను ఆయన తన భార్య ఉపాసన కామినేని ఇంటి ఆనవాయితీ ప్రకారం నిర్వహించారు. బాలికా నిలయం సేవా సమాజ్‌లోని ఆడపిల్లలతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొన్నారు రామ్ చరణ్. ఉపాసన బామ్మ గారు.. ఈ సేవా సమాజ్‌కి మూడు దశాబ్ధాలకు పైగా అండగా నిలుస్తూ వస్తున్నారు. ఆమె గౌరవార్ధం రామ్ చరణ్, ఉపాసనలు ఈ సేవా సమాజ్‌లోని అనాథ బాలికలతో కలిసి దసరా సంబరాలు జరుపుకున్నారు. ప్రేమను పంచాలి. సానుకూల దృక్పథాన్ని సమాజంలో నాటాలి, సంతోషంగా జీవించాలనే ఆలోచనలను బాలికలలో పెంపొందించేలా చరణ్ దంపతులు ఈ పర్వదినాన్ని నిర్వహించుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని అత్యంత వైభవంగా చాటిచెప్పారు. సంస్కృతులను, సంప్రదాయాలను గౌరవిస్తూ, కుటుంబ విలువలను పరిరక్షించుకునేలా ఈ స్టార్ కపుల్ పండుగను చేసుకున్న తీరును సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
శరవేగంగా గేమ్ ఛేంజర్ షూటింగ్ :
ఇకపోతే.. రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ దర్శక దిగ్గజం శంకర్‌తో ‘‘గేమ్ ఛేంజర్’’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్ విలన్‌గా నటిస్తున్నారు. ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరామ్, సునీల్, అంజలి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘‘గేమ్ ఛేంజర్’’ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
దసరాకి గేమ్ ఛేంజర్ నుంచి ఫస్ట్ సాంగ్ :
దసరా పర్వదినం సందర్భంగా అభిమానుల కోసం ఆసక్తికర పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘‘దీపావళి’’కి జరగండి అనే పాటను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది. రామ్ చరణ్, శంకర్‌లతో థమన్ తొలిసారి పనిచేస్తుండటంతో ఈ సినిమా మ్యూజిక్‌పై భారీ అంచనాలున్నాయి. స్వతహాగా శంకర్ సినిమాల్లో పాటలు గ్రాండ్ విజువల్‌గానూ, సాహిత్యపరంగానూ అద్భుతంగా వుంటాయి.