అందుకే...'బ్రూస్ లీ' లో నాన్న గారితో సాంగ్ చేద్దామని శ్రీను వైట్ల అంటే... నేనే వద్దన్నాను : రామ్ చరణ్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల తెరకెక్కించారు. డి.వి.వి. ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై దానయ్య ఈ సినిమాని నిర్మించారు. దసరా కానుకగా బ్రూస్ లీ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బ్రూస్ లీ సినిమా గురించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఇంటర్ వ్యూ
మీకోసం...
బ్రూస్ లీ ప్రీమియర్ షో ప్లాన్ చేసినట్టున్నారు...?
నాకు ప్రీమియర్ షో స్ అంటే అంతగా ఇష్టం ఉండదు. కాకపోతే ఓ మంచి పని చేయడం కోసమని ఈసారి ప్రీమియర్ షో కి ఓకె చెప్పాను. బ్రూస్ లీ చిత్రాన్ని 16న రిలీజ్ చేస్తున్నాం. అయితే 15న దేవనార్ బ్లైండ్ స్కూల్ పిల్లల కోసం బ్రూస్ లీ ప్రీమియర్ షో వేస్తున్నాం. దాదాపు 500 మంది ఈ స్కూల్ విద్యార్ధినీ విద్యార్ధులు ఈ సినిమా చూస్తారు. అలాగే ఈ షో ద్వారా వచ్చే మొత్తాన్ని కూడా దేవనార్ బ్లైండ్ స్కూల్ కి అందజేయనున్నాం.
గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ.. ఈ రెండు ఫ్యామిలీ స్టోరీసే.. వరుసగా ఫ్యామిలీ స్టోరీస్ చేయడానికి కారణం..?
ఫ్యామిలీ స్టోరీస్ తో సినిమా చేయాలని ఈ రెండు అనుకోని చేసిన సినిమాలే.
బ్రూస్ లీ సినిమా ఎలా ఉంటుంది..?
బ్రూస్ లీ సినిమాలో బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది. అలాగే ఫాదర్ సన్ మధ్య మంచి రిలేషన్ ఉంటుంది. సెంటిమెంట్ కూడా బాగా పండింది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రూస్ లీ అందరికీ నచ్చేలా ఉంటుంది.
డైరెక్టర్ శ్రీను వైట్లతో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?
శ్రీను వైట్ల గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. ఆయన సెట్ లో కూడా చాలా సరదాగా ఉంటారు. ఈ సినిమాలో కేవలం కామెడీ కోసం అన్నట్టు సీన్స్ ఉండవు. కథతో పాటు కామెడీ ఉంటుంది. అలాగే ఈ స్ర్కీన్ ప్లే డిఫరెంట్ గా ఉంటుంది.
బ్రూస్ లీ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు కార్తీ. స్టంట్ మాస్టర్ గా నటించాను. మన పక్కింట్లో ఉండే అబ్బాయిగా..ఎవరికివారు తమనితాము చూసుకునేలా నా పాత్ర ఉంటుంది.
బ్రూస్ లీ సినిమాలో మీ లుక్ చాలా కొత్తగా ఉంది..లుక్ ఛేంజ్ మీ నిర్ణయమా..? డైరెక్టర్ నిర్ణయమా..?
ఈ సినిమాలో నా లుక్ కొత్తగా ఉందంటే..ఆ క్రెడిట్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారికే ఇస్తాను. ఎందుకంటే ఆయన చిరుత సినిమా సమయంలో ఉన్న ఫోటోస్ తీసుకువచ్చి ఇలాంటి లుక్ కావాలన్నారు. నాకు కూడా నచ్చి సరే అన్నాను. ఈరోజు నా లుక్ బాగుందని అందరు చెబుతుండడం హ్యాఫీగా ఉంది.
బ్రూస్ లీ ఫైట్ చేసేది ప్రేమ కోసమా..? ఫ్యామిలీ కోసమా..?
ఇది ప్రేమ కథా చిత్రం కాదండి.. బ్రూస్ లీ ఫైట్ చేసేది ఫ్యామిలీ కోసమే.
బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
ఈ సినిమాలో నాన్నగారు చేసిన పాత్రకు ముందుగా వేరే పెద్ద హీరోతో చేద్దాం అనుకున్నాం. కానీ కుదరలేదు. ఆతర్వాత నాన్నగారే చేస్తానన్నారు. ఇక నాన్నగారి పాత్ర విషయాని వస్తే...ఓ ఇంపార్టెంట్ సీన్ లో కనిపిస్తారు. ఆయన్ని సెట్స్ లో చూస్తుంటే గ్యాంగ్ లీడర్ రోజులు గుర్తుకువచ్చాయి. ఆయన స్ర్కీన్ పై చూడాలని అందరిలాగే నేను వెయిట్ చేస్తున్నాను. శ్రీను వైట్ల గారు అయితే నాన్నగారితో ఓ సాంగ్ కూడా చేయిద్దాం అన్నారు. నాన్న డాన్స్ 150వ సినిమాలోనే చేయాలి. అందుకే శ్రీను గారు నాన్నతో సాంగ్ చేయిద్దాం అన్నా..వద్దన్నాను.
మీరు ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో చాలా ఫాస్ట్ గా నాలుగు నెలలోనే చేసిన సినిమా బ్రూస్ లీ. ఇంత ఫాస్ట్ గా చేయడానికి కారణం..?
నిజమే..నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలో చాలా ఫాస్ట్ గా చేసిన సినిమా బ్రూస్ లీ. రోబోలా వర్క్ చేసాం. ఇంత ఫాస్ట్ గా వర్క్ చేసినా కూడా క్వాలిటీ మాత్రం తగ్గలేదు. బ్రూస్ లీ మంచి క్వాలీటీతో వచ్చిందంటే ఆ క్రెడిట్ కెమెరామెన్ మనోజ్ పరమహంసకే ఇస్తాను. అయితే శ్రీను వైట్ల గారితో ఈ విషయం గురించి మాట్లాడాను. ఇంత ఫాస్ట్ గా చేసి ఇప్పుడే రిలీజ్ చేయాలని లేదు. అవసరం అనుకుంటే రెండు నెలలు లేట్ అయిన ఫరవాలేదని చెప్పాను. కానీ డైరెక్టర్ గారు అంతా బాగానే వస్తుంది దసరాకే రిలీజ్ చేద్దాం అన్నారు. అనుకున్న విధంగా రావడంతో రిలీజ్ చేస్తున్నాం.
షారుఖ్ ఖాన్..బ్రూస్ లీ సెట్ కి వచ్చారు కదా..ఎలా ఫీలయ్యారు..?
ఆరోజు రాత్రి 2 గంటలకు బ్రూస్ లీ షూటింగ్ జరుగుతుంది. అప్పుడు షారుఖ్ ఖాన్ మా సెట్ కి రావడం నిజంగా సర్ ఫ్రైజ్. షారుఖ్ బ్రూస్ లీ సాంగ్ చూడడం..డాన్స్ బాగుందని చెప్పడం చాలా హ్యాఫీగా ఫీలయ్యాను.
బ్రూస్ లీ కి తమన్ మ్యూజిక్ అందించారు. ఆడియోకి మీకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటి..?
తమన్ మ్యూజిక్ కి చాలా మంచి రెస్సాన్స్ వస్తుంది. ఈ సినిమాలో పాటలు బాగున్నాయి చెబుతున్నారు. లే చలో సాంగ్, మెగా మీటర్ సాంగ్..ఇలా ఒకటేమిటి ఈ సినిమాలోని అన్ని పాటలు బాగున్నాయనడం సంతోషంగా ఉంది.
బ్రూస్ లీ తమిళ వెర్షెన్ కి బ్రూస్ లీ 2 అనే టైటిల్ పెట్టారు కదా..? తమిళ టైటిల్ విషయంలో ప్రాబ్లమ్స్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి..నిజమేనా..?
బ్రూస్ లీ తమిళ వెర్షెన్ టైటిల్ విషయమైతే ప్రాబ్లమ్ వచ్చినట్టు నేనైతే వినలేదు. నావరకు రాలేదు.
సినిమా రికార్డ్స్ కోసం..హీరోల కంటే ఫ్యాన్స్ ఆలోచిస్తుంటారు కదా..? ఈ విషయం పై కామెంట్ ఏమిటి..?
రికార్డ్స్ గురించి ఫ్యాన్స్ ఎక్కువుగా ఆలోచించడం...కొట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు.
క్రిష్ణవంశీ గారితో గోవిందుడు అందరివాడేలే చేసారు కదా..? ఏమైనా నేర్చుకున్నారా..?
క్రిష్ణవంశీ గారితో వర్క్ చేయడం మరచిపోలేని అనుభూతి. ఆయన నుంచి నేచరల్ గా ఎలా ఉండాలి...? ఎలా నటించాలనే విషయాలు చాలా నేర్చుకున్నాను.
రుద్రమదేవి, బ్రూస్ లీ, అఖిల్..ఈ మూడు సినిమాలు వారం గ్యాప్ లో వస్తున్నాయి. ఇలాంటి పెద్ద సినిమాలకు రెండు వారాలు గ్యాప్ ఉంటే మంచిది కదా..?
అవును..నిజమే మీరన్నట్టు రెండు వారాలు గ్యాప్ ఉంటే మంచిది. గతంలో ఆగడు సినిమా టైంలో మమ్మల్ని రెండు వారాలు గ్యాప్ అడిగితే గోవిందుడు అందరివాడేలే అలాగే రెండు వారాల గ్యాప్ తో రిలీజ్ చేసాం. అలాగే బాహుబలి, శ్రీమంతుడు, కిక్ 2 ఈ మూడు సినిమాలు కూడా అలా ప్లాన్ చేసుకునే చేసారు కూడా. ఇక నా సినిమా విషయానికి వస్తే...మేము ముందుగానే ఎనౌన్స్ చేసాం అక్టోబర్ 15న బ్రూస్ లీ రిలీజ్ చేస్తున్నాం అని. ఈసారి ఎందుకనో రెండు వారాల గ్యాప్ అనేది కుదరలేదు.
కోన వెంకట్, శ్రీను వైట్ల ను కలిపారు..సినిమా కోసమేనా..?
కోన వెంకట్, గోపీ మోహన్, శ్రీను వైట్ల..ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించాయి. కోన వెంకట్, గోపీ మోహన్, శ్రీను వైట్ల కలసి చేస్తే మంచి అవుట్ పుట్ వస్తుందనే ఉద్దేశ్యంతోనే కోన వెంకట్, శ్రీను వైట్లను కలిపాను.
చిరంజీవిగారి 150వ సినిమా ఎనౌన్స్ మెంట్ ఈనెల 16న ఉంటుందని విన్నాం..నిజమేనా..?
నిజమే..ఈనెల 16న నాన్నగారి 150వ సినిమా గురించి ఎనౌన్స్ చేస్తాం.
చిరంజీవి గారి 150వ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు కదా..? ఇక నుంచి నిర్మాత కంటీన్యూస్ గా సినిమాలు నిర్మిస్తారా...?
ఇక నుంచి కంటీన్యూస్ గా సినిమాలు నిర్మిస్తాను. కొణిదల ప్రొడక్షన్ కంపెనీ, వైట్ హార్స్ ...అనే రెండు నిర్మాణ సంస్థలను ప్రారంభిస్తున్నాను. కొణిదల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై పెద్ద సినిమాలు నిర్మిస్తాను.వైట్ హార్స్ బ్యానర్ పై కొత్తవాళ్లను ప్రొత్సహిస్తూ...చిన్న సినిమాలు నిర్మిస్తాను.
మీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
తమిళ్ లో విజయం సాధించిన తని ఓరువన్ తెలుగు రీమేక్ లో నటిస్తున్నాను. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమా తర్వాత గౌతమ్ మీనన్ గారితో సినిమా చేస్తున్నాను. అలాగే కళ్యాణ్ బాబాయ్ ప్రొడక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాకి స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. దర్శకుడు ఎవరనేది ఫైనల్ కాలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments