Ram Charan:రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం.. డాక్టరేట్ ప్రకటించిన ప్రముఖ యూనివర్సిటీ

  • IndiaGlitz, [Thursday,April 11 2024]

RRR మూవీతో రామ్‌చరణ్‌ క్రేజ్ ప్రపంచవ్యాప్తమైంది. మెగా పవర్‌స్టార్ నుంచి గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన చరణ్‌ మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ప్రముఖ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకోబోతున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి చెందిన వేల్స్‌ యూనివర్సిటీ చరణ్‌కు గౌరవ డాక్టరేట్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 13న యూనివర్సిటీలో జరగనున్న స్నాతకోత్సవ కార్యక్రమానికి చరణ్‌ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(AICTE) అధ్యక్షుడు డీజీ సీతారాం చేతుల మీదుగా చరణ్ ఈ డాక్టరేట్ అందుకోనున్నారు.

కళారంగానికి చరణ్ చేసిన సేవలకు గాను ఈ డాక్టరేట్ ప్రదానం చేయబోతున్నట్టు యూనివర్సిటీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ కార్యక్రమంలో పలువురు తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. ఈ వార్త తెలుసుకున్న చెర్రీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ అభిమాన నటుడికి గౌరవ డాక్టరేట్ దక్కడంతో అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు దక్కించుకోవడంతో పాటు ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంటున్నారు.

ఇక చరణ్‌ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం దిగ్గజ దర్శకడు శంకర్ దర్శకత్వంలో 'గేమ్‌ ఛేంజర్' మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 80శాతం పూర్తి అయింది. ఇటీవల చెర్రీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మూవీలోని 'జరగండి' లిరికల్ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో పాటు'రంగస్థలం' కాంబో రిపీట్ కానుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించనుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు. అలాగే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలోనూ చరణ్ నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ పూజాకార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో చరణ్ సరసన అలనాటి అందాల నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుంది.

మొత్తానికి RRR వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత రెండేళ్ల పాటు చెర్రీ సినిమాలు థియేటర్లలో విడుదల కాలేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పుడు ఒకేసారి మూడు చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. రెండు సంవత్సరాల గ్యాప్‌లోనే ఈ చిత్రాలు విడుదల కానున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గౌరవ డాక్టరేట్ రావడంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు.