Ram Charan-Upasana: రామ్‌చరణ్ దంపతులకు అయోధ్య నుంచి ఆహ్వానం
- IndiaGlitz, [Saturday,January 13 2024]
యావత్ ప్రపంచం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం మరో పది రోజుల్లో జరగనుంది. ఈ వేడుక కోసం అయోధ్య అందంగా ముస్తాబవుతోంది. జనవరి 22న జరిగే ఈ చారిత్రాత్మక వేడుకకు దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు తరలిరానున్నారు. ఇప్పటికే రామ జన్మభూమి ట్రస్ట్ వివిధ రంగాల ప్రముఖులకు ఆహ్వానాలు అందించింది. తాజాగా ఈ బృహత్తర కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులకు ఆహ్వానం పలికింది.
అయోధ్య రామమందిరంలో జరిగే 'రామ్ లల్లా' ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా రామ్ చరణ్‌తో పాటు ఆయన భార్య ఉపాసన కొణిదెలను ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు ఆహ్వానం పంపించారు. ఈమేరకు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు సునీల్ అంబేకర్ హైదరాబాద్‌లోని చరణ్ ఇంటికి వెళ్లి మరీ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ ఆహ్వానం పట్ల చెర్రీ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. ఇది తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా సౌత్ ఇండస్ట్రీ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ధనుష్‌లకు మాత్రమే ఆహ్వానం అందింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రణబీర్ కపూర్, అలియా భట్, ఆయుష్మాన్ ఖురానా, రణదీప్ హుడా, అజయ్ దేవగణ్, కంగనా రనౌత్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్ సహా పలువురు నటీనటులను ఆహ్వానించారు. వీరితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులకు కూడా ఆహ్వానాలు పంపారు.
కాగా జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రామమందిరంలో రాములోరి విగ్రహ ప్రతిష్ట జరగనుంది. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. మార్చి 25 వరకు అయోధ్యలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక ఆలయ నిర్మాణాన్ని పురాతన నాగర శైలిలో నిర్మించారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మించారు. ఆలయంలోని ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు కలిగి ఉంది. ఇక 'రామ్ లల్లా' విగ్రహం పొడవు 51 అంగుళాలు, 8 అడుగుల ఎత్తు , 3 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ విగ్రహాన్ని కర్ణాటకు చెందిన అరుణ్ యోగరాజ్ అనే శిల్పి చెక్కారు.