రేపటి నుంచి మంట మామూలుగా ఉండదు: రామ్
- IndiaGlitz, [Wednesday,January 13 2021]
కిషోర్ తిరుమల దర్శకత్వంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘రెడ్’. ఈ సినిమాను శ్రీ స్రవంతి మూవీస్ ఆధ్వర్యంలో స్రవంతి రవి కిషోర్, కృష్ణ చైతన్య కలిసి నిర్మించారు. మణిశర్మ సంగీతాన్ని అందించారు. తమిళ చిత్రం 'తడమ్'కు రీమేక్‌గా ‘రెడ్’ సినిమా రూపొందింది. ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. రామ్ సరసన నివేదా పెతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘రెడ్’ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
‘రెడ్’ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రామ్ ట్వీట్ చేశాడు. ‘రేపటి నుండి థియేటర్స్‌లో మంట మామూలుగా ఉండదు’ అని రామ్ పేర్కొన్నాడు. ఈ సినిమాలో రామ్ రెండు విభిన్నమైన పాత్రల్లో అదరగొట్టినట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. రామ్ ద్విపాత్రనయంలో నటించిన క్లాస్, మాస్ క్యారక్టర్లను చూపించారు. ఈ సినిమాలో సస్పెన్స్, థ్రిల్లర్, ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి మసాలా సమకూర్చినట్లు ఈ ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. దీంతో ఈ సినిమా పక్కా సక్సెస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
గతంలో ‘దేవదాస్’, ‘మస్కా’ సినిమాలు కూడా సంక్రాంతికి వచ్చి రామ్‌కు మంచి సూపర్ హిట్‌ను అందజేశాయి. అదే సెంటిమెంట్ ఈ సారి కూడా వర్కవుట్ అవుతుందని రామ్ భావిస్తున్నాడు. కాగా.. రామ్ తదుపరి సినిమాకు సంబంధించి కూడా జోరుగా టాక్ నడుస్తోంది. తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో రామ్ సినిమా చేయబోతున్నాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్ వినిపిస్తోంది.