రకుల్ కొత్తగా యూట్యూబ్ చానెల్.. ఆదాయమంతా..!

  • IndiaGlitz, [Wednesday,April 08 2020]

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో యావత్ ఇండియా వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం జరిగింది. దీంతో ప్రజారవాణా మొదలుకుని సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు.. థియేటర్స్ సైతం మూసేయడం జరిగింది. దీంతో నటీనటులంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో తమకు తోచినంత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు.. సినీ ఇండస్ట్రీకి విరాళాలు ప్రకటిస్తూ.. మరోవైపు సలహాలు, సూచనలిస్తున్నారు. కొందరు నటీమణులు అయితే తాము నిద్రలేచింది మొదలుకుని నిద్రపోయే వరకూ ఏమేం చేస్తున్నామనే విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఇంకొందరైతే ఇప్పటి వరకూ లేని సోషల్ మీడియా అకౌంట్లను ప్రారంభించి ఫ్యాన్స్, సినీ ప్రియులకు దగ్గరవుతున్నారు.

ఇదీ అసలు విషయం..

ఇక అసలు విషయానికొస్తే.. టాలీవుడ్‌ నటీమణి రకుల్ ప్రీత్‌సింగ్ ఈ మధ్య కొత్తగా యూ ట్యూబ్‌చానెల్‌ను ప్రారంభించింది. ఈ చానెల్‌లో తనకు సంబంధించి యోగాచ వర్కవుట్ వీడియోలు.. వంటల వీడియోలు ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రకుల్ వెల్లడించింది. ఎక్కువగా వంటల వీడియోలే ఉంటాయన్న మాట. ఇప్పుడు తనకు చాలా సమయం ఉందని.. అందుకే యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించానని చెప్పింది. సరదా.. సరదా విషయాలను కూడా ఈ చానెల్ ద్వారా అభిమానులు, ప్రేక్షకులతో పంచుకుంటానని చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగా మొదటి వీడియో చాకొలెట్‌ పాన్‌కేక్‌ను తయారు చేయడం ఎలా..? అనేదానిపై చేసి అప్‌లోడ్ చేసింది.

ఆదాయం మొత్తం పీఎం కేర్‌కే..

కాగా ఈ యూట్యూబ్ చానెల్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం పీఎం కేర్ ఫండ్స్‌ అందించనున్నట్లు స్వయానా రకులే ఓ వీడియో రూపంలో స్పష్టం చేసింది. చానెల్ ద్వారా అందరం ఆనందాన్ని పంచుదామని చెప్పింది. మార్పు కోసం ఇప్పుడే ఛానల్‌ను సబ్‌స్ర్కైబ్‌ చేయండి అని అభిమానులు, సినీ ప్రియులకు రకుల్ పిలుపునిచ్చింది. ఇదిలా ఉంటే.. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన 200 కుటుంబాలకు రకుల్‌ ఆహారం అందజేస్తున్న సంగతి తెలిసిందే. కాగా రకుల్‌తో పాటు పలువురు నటీనటులు కూడా యూట్యూబ్ చానెల్స్.. కొత్తగా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టడం చేస్తున్నారు. ఏదైతేనేం జనాలకు ఉపయోగపడే పనిచేస్తున్న రకుల్‌ను మాత్రం అందరూ మెచ్చుకుంటున్నారు.