వైద్య విద్యార్థినిగా రకుల్..

  • IndiaGlitz, [Monday,February 01 2021]

ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో మంచి అవకాశాలతో దూసుకుపోతోతంది. ఆమె బాలీవుడ్ చిత్రానికి సంబంధించి జంగ్లీ పిక్చర్స్ నుంచి గత ఏడాది డిసెంబర్‌లోనే అధికారిక ప్రకటన వెలువడింది. అనుభూతి కశ్యప్ దర్శకత్వంలో డాక్టర్ జి అనే సినిమాలో రకుల్ నటిస్తోంది. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి తొలిసారిగా రకుల్ నటిస్తోంది. ఈ సినిమాలో డాక్టర్ ఫాతిమా అనే వైద్య విద్యార్థిగా రకుల్ నటించనుంది. క్యాంపస్ కామెడీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో డాక్టర్ ఉదయ్ గుప్తా అనే పాత్రలో ఆయుష్మాన్ నటిస్తున్నారు. రకుల్ ఆయనకు సీనియర్‌గా నటిస్తోంది. తాజాగా ఆమె షూటింగ్‌లో అడుగుపెట్టింది.

ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ.. “డాక్టర్ జి లో భాగం కావడం పట్ల నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ చిత్రంలో నా సహనటుడు ఆయుష్మాన్‌తో నటించడం మొదలు చాలా ఆసక్తికర విషయాలున్నాయి. మాకు స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కల్పించినందుకు జంగ్లీ పిక్చర్స్, దర్శకుడు అనుభూతి కశ్యప్‌లకు కృతజ్ఞతలు. స్క్రిప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఒక ఆసక్తికరమైన కథ. వైద్య వృత్తి చుట్టూ తిరుగుతూ క్యాంపస్‌లో సెట్ చేయబడింది. ఇది ప్రేక్షకులకు సరికొత్త ఫీలింగ్‌ను అందిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా” అని తెలిపింది.

అనుభూతి కశ్యప్ మాట్లాడుతూ... “ఇద్దరు ప్రతిభావంతులైన వ్యక్తులను ఒకచోట చూడటం ఎప్పుడూ ఆసక్తికరమే. ఆయుష్మాన్, రకుల్‌తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. వారిద్దరూ ఎన్ని సార్లు కలిసి పని చేసినా.. సినిమాలో పోషించే పాత్రల మాదిరిగానే ఎప్పుడూ తాజాగానే ఉంటుంది. వారి కెమిస్ట్రీని ప్రేక్షకులు ఎప్పుడూ తొలిసారి చూస్తున్నట్టుగానే భావిస్తారు’’ అని తెలిపారు. జంగ్లీ పిక్చర్స్ సీఈఓ అమృతా పాండే మాట్లాడుతూ.. “ఈ చిత్రం కథ మన హృదయాలకు దగ్గరగా ఉంటుంది. రకుల్ ఈ చిత్రంలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే ఆమె ఒక అద్భుతమైన నటిగా పేరు సంపాదించుకుంది’’ అని తెలిపారు.