Rakshasudu Review
గత కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తొలి సినిమా `అల్లుడు శీను`, ఆ మధ్య బోయపాటితో చేసిన `జయజానకీనాయకా`తో మాస్ హీరోగా ఎలివేట్ అయిన ఆయన పెర్ఫార్మెన్స్ కోసం `సీత` చేశారు. తాజా సినిమా `రాక్షసుడు`లోనూ దాన్నే ట్రై చేశాడు. సెట్ సాంగ్‌లు, ఇరగేసే ఫైట్లకు కాస్త దూరంగా నేచురాలిటీకి దగ్గరగా తమిళంలో విడుదలైన `రాచ్చసన్`కు రీమేక్‌గా విడుదలైన సినిమా `రాక్షసుడు`. ఇంతకు ముందు `కవచం`లో కాప్‌గా చేసిన సాయి ఈ సినిమాలోనూ మళ్లీ ఖాకీ దుస్తులు వేసుకున్నాడు. మరి తంబిలకు నచ్చిన `రాచ్చసన్` తెలుగులో మన తమ్ముళ్లకు ఎక్కుతుందా? చదివేయండి..
కథ:
సినిమాలంటే పిచ్చితో పెరిగి, ఎప్పటికైనా మంచి థ్రిల్లర్ చిత్రాన్ని డైరక్ట్ చేసి పేరు కొట్టేయాలనుకుంటాడు అరుణ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్). అతని తండ్రి పోలీసు ఉద్యోగంలో ఉండి చనిపోవడంతో, ఆ ఉద్యోగం అతనికి వస్తుంది. కానీ వెళ్లి చేరడానికి పెద్దగా మొగ్గుచూపకుండా, ఇండస్ట్రీలో సినిమా కోసం ట్రయల్స్ వేసుకుంటూ ఉంటాడు. తల్లి మాత్రం పోలీస్ ఉద్యోగంలో చేరమని ఒత్తిడి చేస్తుంది. సినిమాల్లో తనకు అవకాశం రాదని వెక్స్ అయిన అతను, ఇక చేసేదేమీ లేక పోలీసుగా పనిచేస్తున్న బావ (రాజీవ్ కనకాల)ను వెళ్లి కలిసి అక్కడ ఉద్యోగంలో జాయిన్ అయిపోతాడు. అక్కడ అతనికి తొలి కేసే చాలా ఆసక్తిగా ఉంటుంది. అప్పటిదాకా తాను స్టడీ చేసిన సైకో కిల్లింగ్ లక్షణాలు, ఆ కేసులో కనిపిస్తుంటాయి. దాన్నే వివరించబోతే ఏసీపీ లక్ష్మి ( సుజానీ జార్జి) పెద్దగా పట్టించుకోదు. పైగా ఈగోతో అతన్ని సస్పెండ్ చేయిస్తుంది. ఆమె టీమ్‌లో పనిచేసే మరో వ్యక్తి వెంకట్ (కేశవ్ దీపక్) మాత్రం అరుణ్‌కి సాయం చేస్తాడు. అలా తన ప్రతిభను నమ్మినవారితో కలిసి కేసును ఛేదిస్తాడు. అయితే ఒకానొక సందర్భంలో సొంత మేనకోడలు సిరి (సినిమాలో రాజీవ్ కనకాల కూతురు)ని కూడా సైకోకి బలివ్వాల్సి వస్తుంది. దాంతో నిద్రలేని రాత్రులు గడిపిన అరుణ్‌కి కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు, అరుణ్‌కి దొరికిన ఓ మ్యూజిక్ బిట్ ఆధారంగా కథ ముందుకు కదులుతుంది. ఆ కథ తమిళనాడుకు చేరుతుంది. తమిళనాడులోని ఓ ప్రదేశానికి చెందిన మేజిక్ చేసే ఓ కుటుంబానికి లింకు కుదురుతుంది. ఆ కుటుంబానికి చెందిన క్రిస్టఫర్ (శరవణన్) ఎవరు? అతనికి, ఈ సీరియల్ కిల్లింగ్‌కి సంబంధం ఏంటి? ఆఖరికి చిన్న పిల్ల కావ్యను ఎందుకు ఎత్తుకొచ్చేస్తాడు? అరుణ్ గర్ల్ ఫ్రెండ్ కృష్ణవేణి (అనుపమ పరమేశ్వరన్)కి కావ్య ఏమవుతుంది? వంటివన్నీ తెలుసుకోవాలంటే సెకండాఫ్ చూడాల్సిందే.
సమీక్ష:
సస్పెన్స్ తో కూడిన థ్రిల్లింగ్, ఎవరు ఎవరిని చంపారు? ఎందుకు చంపారు అనే అన్వేషణ... సక్రమంగా ఉత్కంఠభరితంగా సాగినంత సేపూ.. ఆ తరహా కథలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. గతంలో కమల్‌హాసన్ నటించిన `రాఘవన్` కూడా ఇలాంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లరే.ఆ మధ్య తమిళంలో విడుదలైన `రాచ్చసన్`కు రీమేక్‌గా రూపొందింది. అక్కడ విష్ణు విశాల్ చేశారు. ఇక్కడ సాయి శ్రీనివాస్ కటౌట్ కాప్ రోల్‌కి సూట్ అయింది. అందులోనూ లోపల మదనపడే కొత్త పోలీసుగా బాగా చేశారు. ఏసీపీ లక్ష్మి పాత్రలో నటించిన సునానీ యారొగెంట్, ఈగోయిస్టిక్‌గా బాగా నటించారు. అనుపమకు నటించడానికి పెద్ద స్కోప్ లేదు. రాజీవ్ కనకాల సన్నివేశాలు బావున్నాయి. సిరి కేరక్టర్‌లో నటించిన అమ్మాయి కూడా బాగా చేసింది. అందరూ మనకు కొత్తవారేగానీ, తమిళంలో సుపరిచితులే. సినిమాను తమిళంలో ఉన్నదున్నట్టు ఇక్కడా తీశారు. తెలుగులో మరికాస్త నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అమ్మాయిలకు ఇంట్లో తండ్రి దగ్గరా భద్రత కరవు, స్కూల్లో ఉపాధ్యాయుడి దగ్గరా భద్రత కరవు, సమాజంలో సైకోల వల్లా భద్రత కరవు అని నిత్యం వార్తల్లో చదివే విషయాలను ఇందులో చూపించారు. భయానక దృశ్యాలు ఎక్కువగా ఉంటాయి. శవాలను చూపించిన తీరు జుగుప్సను కలిగిస్తుంది. అమ్మాయిలు అబలలు కాదని, ప్రసవ వేదనను తట్టుకున్నవాళ్లు దేన్నైనా తట్టుకోగలరని, కావాల్సింది పోరాడే పటిమ మాత్రమేననే సందేశాన్ని కూడా ఇచ్చారు. జిబ్రన్ రీరికార్డింగ్ బావుంది. లైటింగ్, ఆర్ట్, కాస్ట్యూమ్స్ కూడా బావున్నాయి. కాకపోతే ఒక జోనర్ ప్రేక్షకులకు మాత్రమే పరిమితమయ్యే సినిమా ఇది. రొమాంటిక్, సరదా సినిమాలను ఎంత మాత్రం అలరిస్తుందనేది ఆలోచించాల్సిన విషయం. ఉన్నంత వరకు దర్శకుడు బాగా హ్యాండిల్ చేశారు.
బాటమ్ లైన్: 'రాక్షసుడు'... సైకో థ్రిల్లర్
- Read in English