Rajyasabha: తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం.. ఏ పార్టీకి ఎన్నంటే..?
- IndiaGlitz, [Tuesday,February 20 2024]
దేశ వ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా పెద్దల సభకు ఎన్నికయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్.. బీఆర్ఎస్ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్లు దాఖలు చేశారు. అయితే కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు వేసిన నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. దీంతో ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
ఇక ఏపీ నుంచి వైసీపీ తరపున నామినేషన్లు వేసిన వైవీ సుబ్బారెడ్డి, గొల్ల సుబ్బారావు, మేడా రఘునాథ్ రెడ్డి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో అభ్యర్థులను నిలపకపోవడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏకగ్రీవమైన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు ధ్రువపత్రాలు అందజేశారు . దీంతో ఈ ముగ్గురు నేతలు పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. వీరి ముగ్గురితో కలిసి రాజ్యసభలో వైసీపీ బలం 11 స్థానాలకు పెరిగింది. అటు 41 సంవత్సరాల టీడీపీ చరిత్రలో తొలిసారి ఆ పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఎగువ సభలో చోటు కావాలంటే మరో రెండు సంవత్సరాల పాటు ఆగాల్సిందే.
అటు గుజరాత్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అశ్విని వైష్టవ్ ఒడిశా నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ కూడా తొలిసారిగా రాజస్థాన్ నుంచి పెద్దల సభలకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రెండున్నర దశాబ్దాల పాటు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన ఆమె మొదటిసారి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. కాగా 1999 నుంచి 2019 వరకు వరుసగా అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల నుంచి ఆమె లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే అనారోగ్యం కారణంగా ఆమె ప్రత్యక్ష ఎన్నికలకు దూరమవుతున్నట్లు ఇటీవల ప్రకటించారు.