Download App

Raju Gari Gadhi 3 Review

టీవీల్లో ప‌లు షోస్‌తో ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుదైన ఓంకార్ జీనియ‌స్ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారాడు. ఈ సినిమా త‌న‌కు పెద్ద‌గా పేరు తెచ్చిపెట్ట‌క‌పోయినా రాజుగారిగ‌ది, రాజుగారిగ‌ది 2 సినిమాలు ఈయ‌న‌కు ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ హార‌ర్ కామెడీ ఫ్రాంచైజీలో విడుద‌లైన మూడో చిత్ర‌మే `రాజుగారిగ‌ది3`. ఈ సినిమాతో ఓంకార్ ఎలాంటి స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నాడ‌నే విష‌యాన్ని తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం..

క‌థ‌:

అశ్విన్‌(అశ్విన్ బాబు) త‌ల్లిదండ్రులు చ‌నిపోవ‌డంతో మావ‌య్య‌(అలీ) సాయంతో పెరిగి పెద్ద‌వాడ‌వుతాడు. ఆటో న‌డుపుతూ ఉంటాడు. అశ్విన్ త‌న మావ‌య్య‌తో క‌లిసి మందు తాగి చేసే గొడ‌వ‌తో కాల‌నీలో మిగ‌తావాళ్లు ఇబ్బందులు ప‌డుతుంటారు. వీరి క‌థ ఇలా సాగుతుండ‌గా.. ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో డాక్ట‌ర్‌గా ప‌నిచేసే మాయ‌(అవికాగోర్‌)కి ఎవ‌రైనా ఐ ల‌వ్ యు చెబితే ఓ య‌క్షిణి వ‌చ్చి వారిపై దాడి చేస్తుంటుంది. ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో మాయ‌కి ఐ ల‌వ్ యు చెప్పి యక్షిణితో దెబ్బలు తిన్న ఓ డాక్ట‌ర్‌(బ్ర‌హ్మాజీ)కి ఓ ఆలోచ‌న వ‌స్తుంది. అశ్విన్‌కి మాయ‌పై ప్రేమ‌ను పుట్టిస్తే య‌క్షిణి అశ్విన్ ప‌నిప‌డుతుంది కాబ‌ట్టి త‌మ కాల‌నీకి బాధ‌లు త‌ప్పుతాయ‌ని అనుకుంటాడు. డాక్ట‌ర్ ప్లాన్ కార‌ణంగా అశ్విన్‌, మాయ ప్రేమ‌లో ప‌డ‌తారు. అశ్విన్‌పై య‌క్షిణి దాడి చేస్తుంది. కేర‌ళ‌లో ప్ర‌ముఖ భూత మాంత్రికుడు గ‌రుడ పిళ్లై(అజ‌య్ ఘోష్‌) కూతురే మాయ అనే నిజం అశ్విన్‌కి తెలుస్తుంది. దాంతో మాయ కోసం అశ్విన్ కేర‌ళ వెళ‌తాడు. అప్పుడు అశ్విన్ ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటాడు. మాయ‌కి పొంచి ఉండే ప్ర‌మాద‌మేంటి?  మాయ‌ను ప్ర‌మాదం నుండి అశ్విన్ ఎలా కాపాడుతాడు?  అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

స‌మీక్ష:

హార‌ర్ కామెడీ జోన‌ర్‌లో 2015లో రూపొందిన `రాజుగారిగ‌ది` ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డ‌మే కాదు.. క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా చాలా పెద్ద స‌క్సెస్ అయ్యింది. దీంతో నాగార్జున, స‌మంత‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో `రాజుగారి గ‌ది 2`లో న‌టించారు. ఇప్పుడు ఈ స‌క్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీలో వ‌చ్చిన మూడో పార్ట్ `రాజుగారిగ‌ది 3`లో తొలి పార్ట్‌లా హార‌ర్‌, కామెడీ అంశాల‌కు డైరెక్ట‌ర్ ఓంకార్ పెద్ద పీట వేసుకున్నాడు. అయితే రాజుగారిగ‌ది త‌ర్వాత చాలా హార‌ర్ కామెడీ జోన‌ర్ చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన‌వే. ఈ సినిమాలో చెప్పుకునేంత క‌థేం లేదు. అలాగని హార‌ర్‌, కామెడీ అంశాలు బాగా ఉన్నాయా? మ‌న‌కు తెలిసిన విష‌యాలే. అయితే సెకండాఫ్‌లో వ‌చ్చే బంగ్లాల‌ని హార‌ర్ ప్రేక్ష‌కుల‌ను బాగా న‌వ్విస్తుంది. ఇక సినిమాలో చెప్పుకునేంత‌గా ఏమీ లేదు. అశ్విన్ బాబును హైటైట్ చేసేలా ఫ‌స్టాఫ్‌ను ద‌ర్శ‌కుడు ఓంకార్ చిత్రీక‌రించిన‌ట్లు క‌న‌ప‌డింది. అవికా పాత్ర‌కు పెద్ద‌గా స్కోప్ ద‌క్క‌లేదు. మాస్ ఆడియెన్స్ కోసం ఓ మాస్ సాంగ్‌ను కూడా పెట్టారు. ఇక సెకండాఫ‌లో అజ‌య్ ఘోష్‌, అలీ, ఐశ్వ‌ర్య పాత్ర‌లే మెయిన్ ఎందుంక‌టే సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్‌లో వ‌చ్చే హార‌ర్ కామెడీ ఎలిమెంట్స్‌ను ఈ మూడు పాత్రలు చ‌క్క‌గా క్యారీ చేశాయి. ఇక క్లైమాక్స్ గొప్ప‌గా ఏమీ లేదు. ఎంగేజింగ్ స‌న్నివేశాలు లేవు. శివ‌శంక‌ర్ మాస్ట‌ర్‌, ధ‌న్‌రాజ్‌, బ్ర‌హ్మాజీ, ప్ర‌భాస్ శ్రీను, హ‌రితేజ‌, అలీ, అజ‌య్ ఘోష్‌, ఐశ్వ‌ర్య పాత్ర‌లను వారి వారి ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు. ష‌బీర్ సంగీత హోరులో సాహిత్యం కాన‌రాలేదు. హార‌ర్ కాన్సెప్ట్ నేప‌థ్య సంగీతం ప‌రావాలేదు ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ బావుంది.

చివ‌ర‌గా..హార‌ర్ కామెడీ స‌న్నివేశాల‌తో కాసేపు మాత్ర‌మే న‌వ్వించే `రాజుగారిగ‌ది 3`

 

Read 'Raju gari Gadhi 3' Movie Review in English

Rating : 2.8 / 5.0