Download App

Raju Gari Gadhi 2 Review

సీక్వెల్స్ సినిమాలు మ‌న ద‌గ్గ‌ర ఆడుతాయా? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌.

నాగార్జున కొత్త‌గా మెంట‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తున్నార‌ట క‌దా.. అనేది ఒక ఆస‌క్తి.

`రాజుగారి గ‌ది` భారీ విజ‌యాన్ని సాధించిందిగా.. అలాంట‌ప్పుడు ఓంకార్ ఈ సినిమాను ఇంకెంత బాగా తీర్చిదిద్ది ఉంటాడు.. ఒక ఆరా.

పీవీపీ సంస్థ తీస్తున్న సినిమాలు ఈ మ‌ధ్య బాగా ఆడుతున్నాయి.. ఈ సినిమా కూడా హిట్ అవుతుంది.. ఇది ఒక ఆశ‌.

అక్కినేని ఇంట్లో స‌మంత అడుగు పెట్టిన ఘ‌డియ‌ల్లో విడుద‌ల‌వుతున్న సినిమా.. స‌మంత ల‌క్కీనా?  కాదా? అనేది తేలిపోతుంది.. ఇది కొంద‌రి మ‌నోగ‌తం...

ఇలా ఎన్నెన్నో ఆశ‌లు, ఆకాంక్ష‌లు, ఆరాలు, అనుమానాల మ‌ధ్య విడుద‌లైంది రాజుగారి గ‌ది 2. ఈ సినిమా ఎలా ఉంది? ఎవ‌రి ఆలోచ‌న తో పోలింది? చ‌దివేయండి. ఆల‌స్యం ఎందుకిక‌?

క‌థ:

అశ్విన్‌, వెన్నెల‌కిషోర్‌, ప్ర‌వీణ్ మంచి స్నేహితులు. అశ్విన్‌లా కాకుండా వెన్నెల‌కిషోర్‌, ప్ర‌వీణ్‌లు అమ్మాయిల వెంట‌ప‌డ‌తారు. కానీ హానీ చేసే వ్య‌క్తులు మాత్రం కారు. ముగ్గురు క‌లిసి వైజాగ్‌లో రిసార్ట్ బిజినెస్‌ను స్టార్ట్ చేస్తారు. సుహానిసా(శీర‌త్‌క‌పూర్‌) వీరి రిసార్ట్‌లో వ‌స్తుంది. ఆమెను ముగ్గులో దింప‌డానికి వెన్నెల‌కిషోర్‌, ప్ర‌వీణ్‌లు ప్ర‌య‌త్నిస్తారు. కానీ ఓ ఆత్మ ఇద్ద‌రినీ భ‌య‌పెడుతుంది. ఇద్ద‌రూ సుహానిసాయే ఆత్మ అనుకుని భ‌య‌ప‌డ‌తారు. ఆ విష‌యాన్ని అశ్విన్‌కు చెబితే అత‌ను న‌మ్మ‌డు. అయితే ఓ సంద‌ర్భంలో అశ్విన్‌కు కూడా ఆత్మ క‌న‌ప‌డి భ‌య‌పెడుతుంది. దాంతో ముగ్గురు కలిసి ఎలాగైనా ఆత్మ భారి నుండి త‌ప్పించుకోవాల‌ని ఓ చ‌ర్చి ఫాద‌ర్‌(సీనియ‌ర్ న‌రేష్‌)ను క‌లుస్తారు. సీనియ‌ర్ న‌రేష్ స‌హాయంతో వారికి రుద్ర‌(నాగార్జున అక్కినేని) ప‌రిచ‌యం అవుతాడు. ముందు ఆత్మ‌కు పెద్ద శ‌క్తులేం లేద‌ని అనుకున్న రుద్ర‌కు ఊహించ‌ని ప‌రిస్థితి ఎదురు కావ‌డంతో..ఎలాగైనా ఆత్మ గురించి తెలుసుకోవాల‌ని ముందుడుగేస్తాడు రుద్ర‌. అప్పుడు రుద్ర‌కు ఎలాంటి నిజాలు తెలుస్తాయి. అస‌లు అమృత ఎవ‌రు? ఆమెకు ఏం అన్యాయం జ‌రిగింది?  దానికి కార‌ణ‌మెవ‌రు అనే విష‌యాల‌ను తెలుసుకోవాంటే సినిమా చూడాల్సిందే..

ప్ల‌స్ పాయింట్స్:

మెంట‌లిస్ట్ అంటే ఏంటి? అని  చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. అయితే అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా త‌న మాట‌ల్లో చెప్పారు అబ్బూరి ర‌వి. దాన్ని ద‌ర్శ‌కుడు ఓంకార్ కూడా చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. నాగార్జ‌న ..రుద్ర పాత్రలో ప‌రిచ‌యానికి వాడిన సీన్స్ క‌న్విన్సింగ్‌గా ఉన్నాయి. అబ్బూరి ర‌వి పెన్ను బ‌లం క్లైమాక్స్ డైలాగుల్లో క‌నిపించింది. స‌మంత ఈ త‌ర‌హా పాత్ర చేయ‌డం తొలిసారి అయినా చాలా బాగా మెప్పించింది.హార‌ర్ సినిమా అన‌గానే వికృత‌మైన రూపాలు, భ‌యాన‌క శ‌బ్దాలు.. వెకిలి చేష్ట‌లు వంటివి ఈ మ‌ధ్య వ‌స్తున్న చాలా చిత్రాల్లో మామూలైపోయాయి. కానీ వాట‌న్నిటికీ భిన్నంగా ప‌ద్ధ‌తిగా ఉంది ఈ సినిమా. మెంట‌లిస్ట్ రుద్ర పాత్ర‌లో నాగార్జున ఇట్టే ఇమిడిపోయారు. ఆయ‌న పాత్ర‌ను ప‌రిచ‌యం చేసిన తీరుకు ఓంకార్‌ను మెచ్చుకోవ‌చ్చు.  ఇక స‌మంత కూడా ఆత్మ పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించింది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో నాగ్‌తో పోటీప‌డి న‌టించింది. రావు ర‌మేశ్‌, సీనియ‌ర్ న‌రేశ్‌, శీర‌త్ క‌పూర్‌, వెన్నెల కిశోర్‌, ప్ర‌వీణ్‌, అశ్విన్‌.. ప్ర‌తి ఒక్క‌రూ వారి పాత్ర‌ల్లో మెప్పించారు. త‌మ‌న్ రీరికార్డింగ్ చాలా బాగా చేశారు. సినిమాను మ‌రో లెవ‌ల్‌కి తీసుకెళ్లింది రీ రికార్డింగ్‌. విజువ‌ల్ ఎఫెక్ట్స్ కి కూడా చాలా మంచి మార్కులే వేయొచ్చు. అలల్లో, గాల్లో ఆత్మ క‌లిసే స‌న్నివేశాలు, స్విమ్మింగ్ పూల్ స‌న్నివేశాలతో పాటు సెకండాఫ్‌లోనూ చాలా చోట్ల విజువ‌ల్ ఎఫెక్స్ట్ మెప్పించాయి. ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో మెచ్యూరిటీ క‌నిపించింది. కెమెరా వ‌ర్క్ ని స్పెష‌ల్‌గా మెన్ష‌న్ చేయాల్సిందే.

మైన‌స్ పాయింట్స్:

రాజుగారి గ‌ది సినిమా గురించి ప్ర‌స్తావ‌న రాగానే అంద‌రికీ ష‌క‌ల‌క శంక‌ర్ చేసిన కామెడీ గుర్తుకొస్తుంది. ఈ సినిమాలోనూ ష‌క‌ల‌క శంక‌ర్ ఉన్న‌ప్ప‌టికీ తొలిస‌గంలో ప్ర‌వీణ్‌, వెన్నెల‌కిశోర్, అశ్విన్ మ‌ధ్య కాస్త కామెడీ క‌నిపించింది. తొలిస‌గాన్ని దృష్టిలో పెట్టుకుని కేవ‌లం కామెడీని ఆశించి వెళ్లిన వారికి మాత్రం కాసింత నిరాశ త‌ప్ప‌దు. అక్క‌డ‌క్క‌డా కాసింత ల్యాగ్ త‌ప్ప చెప్పుకోద‌గ్గ మైన‌స్ పాయింట్లు ఏమీ క‌నిపించ‌వు.

స‌మీక్ష:

రాజుగారిగ‌ది సినిమా సిరీస్‌లో భాగంగా వ‌చ్చిన `రాజుగారి గ‌ది 2`కూడా హార‌ర్ ప్ర‌ధాన‌మైందే. అయితే మెయిన్ పాయింట్‌ను మ‌ల‌యాళ సినిమా `ప్రేత‌మ్‌` సినిమా నుండి తీసుకుని తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా క‌థ‌ను రాసుకున్నారు ద‌ర్శ‌కుడు ఓంకార్‌. క‌థ‌పై న‌మ్మ‌కంతో సినిమాలో మెంట‌లిస్ట్ క్యారెక్ట‌ర్ చేసిన నాగ్‌. సినిమాకు త‌న‌దైన న‌ట‌న‌తో జీవం పోశాడు. ఇక కీల‌కంగా మారిన ప్రీ క్లైమాక్స్లో స‌మంత న‌ట‌న..క్లైమాక్స్‌లో నాగార్జున‌, స‌మంతల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకు ఆయువు ప‌ట్టుగా మారాయి. సినిమాలో సెకండాఫ్ ఏంటో అర్థ‌మ‌వుతుంది కానీ. అస‌లు ఇంత‌కు కార‌ణ‌మైందెవ‌రు అనే విష‌యాన్ని చివ‌రి వ‌ర‌కు స‌స్పెన్స్‌గా మెయిన్‌టెయిన్ చేసేలా స్క్రీన్‌ప్లేను ద‌ర్శ‌కుడు ఓంకార్ బాగానే రాసుకున్నాడు. ఇక గ్రాఫిక్స్ సినిమాలో మ‌రో కీల‌కభూమిక‌ను పోషించాయి. థ‌మ‌న్ రీరికార్డింగ్‌, దివాక‌ర‌న్ కెమెరా ప‌నితం సినిమాను మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లింద‌న‌డంలో సందేహం లేదు. మ‌ల‌యాళ వెర్ష‌న్‌లో ఉన్న‌ట్లుగానే ఫ‌స్టాప్ ఉన్నా, సెకండాఫ్‌ను చ‌క్క‌గా ప్రెజెంట్ చేశారు. ముఖ్యంగా హీరో  క్యారెక్ట‌ర్ ఎలివేట్ చేసిన తీరు అభినంద‌నీయం. ఎంట‌ర్‌టైన్‌మెంట్ పరావాలేద‌నేలానే ఉంటుంది. ఆడ‌పిల్ల‌ల‌కు ధైర్యం అవ‌స‌రం. క‌ష్టంలో వారికి స‌హాయం చేయ‌క‌పోయినా ప‌రావాలేదు. కానీ సూటిపోటీ మాట‌లు అన‌కూడ‌దు. అది ఎవ‌రినైనా, ఏ ర‌కంగా అయినా బాధిస్తుంది. అలాగే అమ్మాయిలు కూడా ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను ధైర్యం ఫేస్ చేయాలి. లేకుంటే స‌మాజంలో మ‌న‌లేరు అనే మెసేజ్‌ను ఈ చిత్రంలో చ‌క్క‌గా చూపించారు. మొత్తంగా రాజుగారి గ‌ది 2  ఆడియెన్స్‌ను అల‌రిస్తుంది.

బాట‌మ్ లైన్: కాస్త భ‌యం, కాసింత ఎంట‌ర్‌టైన్మెంట్‌..ఆక‌ట్టుకునే ఎమోష‌న్స్ క‌ల‌యికే..`రాజుగారి గ‌ది 2

Raju Gari Gadhi 2 Movie Review in English
 

Rating : 3.0 / 5.0