Raju Gadu Review
రాజ్ తరుణ్ పేరు వినగానే ఉయ్యాల జంపాల, కుమారి 21ఎఫ్ తరహా చిత్రాలు గుర్తుకొస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో ఆయన నటించిన `అంధగాడు`, `ఈడో రకం ఆడో రకం` సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. రాజ్ తరుణ్ ప్రస్తుతం `ఒక్క హిట్ సినిమా` కోసం వేచి చూస్తున్నారు. అలాంటి సమయంలో విడుదలైన సినిమా `రాజుగాడు`. క్లెప్టోమేనియా వ్యాధితో బాధపడే కుర్రాడిగా ఆయన నటించిన `రాజుగాడు` ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా? అనేది తెలియాలంటే కథలోకి వెళ్లిపోండి.
కథ:
రామాపురం ఊరి పెద్ద సూర్య నారాయణ (నాగినీడు). ఎవరైనా దొంగతనం చేస్తే తట్టుకోలేదు. పెద్ద పెద్ద శిక్షలే విధిస్తుంటాడు. ఆ ఊరి ఆలయ ధర్మకర్త కూడా ఆయనే. ఆయన ఇంట్లో పనిచేసే అంజిగాడు (రావు రమేశ్) దేవుడి సొమ్ములు దొంగతనం చేశాడని పాతికేళ్లు ఊరి బహిష్కరణ చేస్తాడు సూర్యనారాయణ. ఆయన మనవరాలు తన్వి (అమైరా). మరోవైపు క్లెప్టోమేనియా (తనకి కూడా తెలియకుండా దొంగలించడం) అనే వ్యాధితో బాధపడుతుంటాడు రాజు (రాజ్ తరుణ్). అతన్ని తల్లిదండ్రులు (రాజేంద్రప్రసాద్, సితార) కంటికి రెప్పలా పెంచుకుంటారు. అతను తన్విని ప్రేమిస్తున్నాడని తెలిసి ప్రోత్సహిస్తారు. ఇరు వైపు పెద్దలు వీరి ప్రేమను అంగీకరిస్తారు. అయితే రామాపురంలో పది రోజులు గడపాల్సిందిగా సూర్యనారాయణ కండిషన్ పెట్టడంతో అంతా అక్కడికి చేరుకుంటారు. అక్కడ ఏమైంది? దొంగతనం అలవాటున్న రాజుగాడి చేతికి టెర్రరిస్ట్ ల బాంబు ఎక్కడి నుంచి వచ్చింది? దానికి సంబంధించి అతను ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? వంటి అంశాలన్నీ మిగిలిన కథలో భాగం.
ప్లస్ పాయింట్లు:
గోపీసుందర్ మ్యూజిక్ బావుంది. బాణీలు బావున్నాయి. నేపథ్య సంగీతం బావుంది. పాటల్లో సాహిత్యం కూడా బావుంది. కెమెరా పనితనం, కొన్ని చోట్ల సెట్టింగ్స్, కొన్ని లొకేషన్లు బావున్నాయి. రావు రమేశ్, నాగినీడు, సితార, రాజేందప్రసాద్ నటన బావుంది. ప్రవీణ్, సుబ్బరాజు, కృష్ణభగవాన్ తదితరులు తమకిచ్చిన పాత్రల్లో మెప్పించారు. కథ మొదలుకావడం బావుంది.
మైనస్ పాయింట్లు:
ఇందులో కథగా చెప్పుకోవడానికి ఏదీ లేదు. కథనం కూడా అంతంతమాత్రంగానే సాగింది. ఊరి పెద్ద, ఆ ఊరిలో ఒక దుర్బుద్ధి కలవాడు, అక్కడి నుంచి వెలేయడం, ఊరి పెద్ద మనవరాలిని హీరో ప్రేమించడం, తన లోపం బయటపడకుండా దాన్ని కవర్ చేసుకోవడం వంటివాటిలో ఏదీ కొత్తగా అనిపించదు. అన్నీ పాత విషయాలే. పైగా స్లోగా సాగుతుంది సినిమా. మచ్చుకైనా కొత్తదనం కనిపించదు. హాస్యం లేదు. మాటలు పేలలేదు. పాటలు కూడా చాలా వరకు అసందర్భంగానే వస్తాయి.
విశ్లేషణ:
హీరోకి లోపం ఉంటే ఆ సినిమాకు ఓపెనింగ్స్ వస్తాయి.. పైగా మల్టీప్లెక్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకోవచ్చు అనే ట్రెండ్ సాగుతున్న రోజులివి. ఈ సమయంలో దొంగతనం అనేది అలవాటుగా మారిన ఓ యువకుడి కథగా `రాజుగాడు` కథ తెరకెక్కింది. అయితే ఈ సినిమా కథగా ఒక పాయింట్‌లో బాగానే ఉంటుంది కానీ, ఎక్కడా బలమైన సన్నివేశాలు కనిపించవు. రాజుగాడిని తన్వి ఎందుకు ప్రేమిస్తుందో అర్థం కాదు. అతని దొంగని తెలిసినప్పుడు ఆమె ప్రవర్తించే విధానం, ఆ తర్వాత అతను నేరాన్ని కావాలనే తనమీద వేసుకున్నాడని తెలిసినప్పుడు ప్రవర్తించే విధానం వంటివన్నీ భావోద్వేగాలకు అతీతంగా అనిపిస్తాయి. ఎక్కడా డీప్ ఎమోషన్స్ కనిపించవు. అంతా ఏదో పైపైకి సాగుతున్నట్టు అనిపిస్తుంది. పాటలు బాగానే ఉన్నా, వాటికి సరైన ప్లేస్ మెంట్ ఇవ్వలేదు. ఈజ్ ఉన్న నటీనటులనే ఎంపిక చేసుకున్నారు, కానీ వాళ్లను గైడ్ చేసే విధానం బాగా లేదన్నది స్పష్టమవుతుంది. రొటీన్‌గా, ఇంకా చెప్పాలంటే రొటీన్‌కి కూడా రొటీన్ అనిపించేలా సాగిన సినిమా ఇది. ఏ కోశాన ఆసక్తిగా అనిపించదు. అనాసక్తంగా సాగిన కథనం ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తుంది.
బాటమ్ లైన్: రాజుగాడు.. బోరుగాడు!
- Read in English