రాజీవ్ కనకాల ఇంట విషాదం.. కేన్సర్‌తో సోదరి కన్నుమూత
- IndiaGlitz, [Monday,April 06 2020]
టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల ఇంట మరో విషాదం నెలకొంది. రాజీవ్ సోదరి, ప్రముఖ టీవీ నటి శ్రీలక్ష్మి గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె కొద్దిరోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. అయితే.. పరిస్థితి విషమమించడంతో ఇవాళ కన్నుమూశారని కుటుంబ సభ్యులు మీడియాకు వివరాలు వెల్లడించారు. కాగా.. విషయం తెలుసుకోగానే చాలా మంది మిత్రులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు తమ ఇంటికి రావాలని అనుకున్నారని కానీ.. ‘కరోనా’ నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితుల రీత్యా శ్రీలక్ష్మి భౌతికకాయాన్ని సందర్శించేందుకు ఎవరూ రావొద్దని శ్రీలక్ష్మి కుటుంబసభ్యులు ఈ మేరకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. శ్రీలక్ష్మీ హఠాన్మరణంతో రాజీవ్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు టాలీవుడ్ ప్రముఖులు, నటీనటులు ఆమె మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేశారు.
సీరియల్స్ నటన.. సుమతో మంచి అనుబంధం..
కాగా.. శ్రీలక్ష్మి ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాసు కనకాల ఏకైక కుమార్తె. ఆమె భర్త సీనియర్ జర్నలిస్ట్ పెద్ది రామారావు. ఈమెకు ఇద్దరు కుమార్తెలున్నారు. తండ్రి దేవదాస్ కనకాల రూపొందించిన ‘రాజశేఖర చరిత్ర’ అనే సీరియల్ ద్వారా శ్రీలక్ష్మి బుల్లి తెరకు పరిచయం అయ్యారు. ఈ సీరియల్‌తో ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు. అంతేకాదు.. సుమకు, రాజీవ్ కనకాలతో పెళ్లి కాక ముందే... శ్రీలక్ష్మీకి ఆమె మంచి స్నేహితురాలు. ఇద్దరూ కలిసి సీరియల్స్‌లో కూడా నటించారు. సుమ, రాజీవ్ లవ్ స్టోరీలో కూడా శ్రీలక్ష్మీ మీడియేటర్‌గా పనిచేశారని ఓ ఇంటర్య్వూలో ఆమే స్వయంగా చెప్పారు. సుమతో ఆమెకు మంచి అనుబంధం ఉంది. ఆ తర్వాత కూడా చాలా తెలుగు సీరియల్స్‌లో నటించి మెప్పించారు. కేన్సర్ వ్యాధితో బాధపడుతుండటంతో ఆమె నటనకు దూరమయ్యారు. ఇదిలా ఉంటే.. గతేడాది రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే.
చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
శ్రీలక్ష్మి మరణంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీలక్ష్మి కనకాల అనేక పాత్రలతో టెలివిజన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారని పేర్కొన్నారు. బుల్లితెర రంగంపై ఆమె చెరగని ముద్ర వేశారని కొనియాడారు.