మరో సినిమాకు రజినీ సైన్... వచ్చే ఏడాది కూడా పార్టీ లేనట్టేనా?
- IndiaGlitz, [Tuesday,July 07 2020]
సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ పెట్టడం వచ్చే ఏడాది కూడా జరిగేలా కనిపించడం లేదు. జయలలిత మరణం, కరుణానిధి తప్పుకోవడం వంటి ఘటనలతో తమిళ రాజకీయాల్లో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ఫ్యాన్ ఫేర్ కలిగిన నాయకుడు కావాలి. ఈ నేపథ్యంలో రజినీకాంత్ రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్త తమిళ వాసుల్లో ఆనందోత్సాహాలు నింపింది. కానీ రజినీ రాజకీయ ఆరంగేట్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. రజినీ పార్టీ పెడతారని ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రజానీకానికి ఎప్పటికప్పుడు నిరాశే ఎదరవుతోంది.
అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది. ఇలా రజినీ రాజకీయాల్లోకి వస్తానంటూ సంకేతాలివ్వడం.. తరువాత దాని ఊసే ఎత్తకపోవడం.. సినిమా ప్రమోషన్ల కోసమేనన్న విమర్శలూ లేకపోలేదు. దీనికి కారణం.. ఆయన తన రాజకీయ ప్రవేశానికి సంబంధించిన సంకేతాలను సినిమా రిలీజ్కు ముందు ఇవ్వడం.. రిలీజ్ అనంతరం సైలెంట్ అయిపోవడమే. అయితే ప్రస్తుతం రజినీకాంత్ కమల్ హాసన్ నిర్మాణంలో మూవీని అంగీకరించారు. ఈ సినిమాకు ‘ఖైదీ’ దర్శకుడు లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ పరిస్థితుల్లో ఈ ఏడాది సినిమా షూటింగ్లు జరిగే అవకాశం పెద్దగా లేదు. దీంతో ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది కూడా రజినీ రాజకీయ పార్టీ పెట్టే అవకాశం లేదని తెలుస్తోంది.