శశికళకు రజినీకాంత్ ఫోన్..

దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. అయితే శశికళ ఆరోగ్య విషయమై రజనీ ఆరా తీసినట్టు ఆమె మేనల్లుడు టీవీవీ దినకరన్ వెల్లడించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తనకు ఫోన్ చేశారని... చిన్నమ్మ ఆరోగ్యం గురించి ఆరా తీశారని తెలిపారు. సుదీర్ఘ ప్రయాణం చేసి ఆమె అక్కడికి చేరుకున్నారని... ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని దినకరన్ మీడియాతో అన్నారు. శశికళకు రజనీ ఫోన్ చేయడం పట్ల తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

కొద్ది రోజుల క్రితం రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన రజనీ అనంతరం అనారోగ్య కారణాల రీత్యా తన ఆలోచనను విరమించారు. అయితే రజినీ పార్టీ అయితే పెట్టబోరని.. కానీ ఏదో ఒక పార్టీకి మాత్రం అనుకూలంగా ఉంటారని చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో శశికళకు రజినీ ఫోన్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరి శశికళకు రజనీ ఫోన్ చేయడం పట్ల ఏదైనా రాజకీయం ఉందా అనే కోణంలో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అక్రమార్జన కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించి ఇటీవల శశికళ విడుదలయ్యారు. ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. సోమవారం ఉదయం బెంగళూరు నుంచి వేలాదిమంది పార్టీ ప్రముఖులు, కార్యకర్తలతో శశికళ చెన్నై నగరానికి బయలుదేరారు. దారి పొడవునా అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘనస్వాగతం పలి కారు. అడుగడునా శశికళకు జనం నీరాజనం పలికారు. ఆమె రాకతో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది.