భారీస్థాయిలో అమ్ముడైన రజనీ 'కాలా' శాటిలైట్ హక్కులు
- IndiaGlitz, [Tuesday,March 20 2018]
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘కాలా’. రజనీ అల్లుడు, యువ కథానాయకుడు ధనుష్ ఈ చిత్రాన్ని వండర్ బేర్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించారు. రజనీతో ‘కబాలి’ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు పా.రంజిత్.. ‘కాలా’కి కూడా దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. అభిమానుల్లో అయితే ఆసక్తి తారాస్థాయికి చేరింది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా శాటిలైట్ హక్కుల కోసం భారీస్థాయిలో పోటీ ఏర్పడిన నేపథ్యంలో.. ఈ హక్కుల్ని ప్రముఖ టీవీ నెట్ వర్క్ స్టార్ గ్రూప్ రూ.75 కోట్లకి సొంతం చేసుకుందని సమాచారం. తమిళంతో పాటు.. తెలుగు, హిందీ భాషలకు గాను ఈ మొత్తాన్ని చెల్లించినట్టు తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమా థియేట్రికల్ హక్కుల్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రూ.125కోట్లతో సొంతం చేసుకున్న విషయం విదితమే. దీన్నిబట్టి రజనీ స్టామినా ఏమిటో మరోసారి రుజువైందంటూ తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ఈ చిత్రాన్ని వేసవి సందర్భంగా ఏప్రిల్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.