తన ఆరోగ్యం పై వస్తున్న వార్తలకు రజనీ వివరణ....
- IndiaGlitz, [Thursday,July 28 2016]
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం పై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నవిషయం తెలిసిందే. రజనీ ఆరోగ్యం పై వార్తలు రావడంతో అటు అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీలో రజనీకాంత్ కు అసలు ఏం అయ్యింది అనే చర్చ మొదలైంది. అయితే... అమెరికా నుంచి ఇటీవల చెన్నై వచ్చిన రజనీకాంత్ తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తల పై క్లారిటీ ఇచ్చేసారు. తన ఆరోగ్యంతో పాటు కబాలి గురించి స్వయంగా లేఖ రాసి మీడియాకు అందచేసారు. ఈ లేఖలో రజనీకాంత్ ఏం రాసారంటే...శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రోబో 2.0, భావోద్వేగాలు గల విభిన్నకథా చిత్రం కబాలి ఈ రెండు చిత్రాల్లో వరుసగా పాల్గొనడం వలన శారీరకంగా, మానసికంగా అలసిపోయాను.
దీనిని నుంచి బయటపడేందుకు విశ్రాంతి అవసరమనిపించి నా కూతురు ఐశ్వర్య తో కలిసి రెండు నెలలు అమెరికా వెళ్లాను. అక్కడ వైద్య పరీక్షలు కూడా చేయించుకున్నాను. నా మాతృదేశానికి వచ్చాకా నాకు కొత్త బలం వచ్చినట్టు అనిపించింది. ఇక కబాలి విజయం గురించి విన్నాకా మనసు మరింత ప్రశాంతంగా మారింది. నా మిత్రుడు థను, కబాలి దర్శకుడు రంజిత్, చిత్రయూనిట్ కు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అలాగే నా ప్రియమైన అభిమానులకు, మీడియా ప్రతినిధులకు, ప్రజలకు, ధియేటర్ల యజమనులకు, పంపిణీదారులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అని స్వయంగా లేఖలో రాసారు.