కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన కీలక సమాచారమిచ్చిన రాజేష్ భూషణ్..
- IndiaGlitz, [Thursday,July 30 2020]
ప్రపంచమంతా కరోనా విజృంభిస్తోంది. కరోనా విముక్తి కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. దీనికోసం శాస్త్రవేత్తలు కూడా తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు. తమ దేశానికి సంబంధించిన వ్యాక్సిన్‌ను ముందుగా తీసుకురావాలని అన్ని దేశాలూ శ్రమిస్తున్నాయి. అయితే ఆయా వ్యాక్సిన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. భారత్‌లో వ్యాక్సిన్ల పరిస్థితిని ఆయన వెల్లడించారు.
మన దేశంలో రెండు వ్యాక్సిన్లు తయారవుతున్నాయని.. అవి రెండూ ఫేజ్-1, 2 దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఒక వ్యాక్సిన్ 1150 మందిపై క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఇచ్చారని.. రెండో వ్యాక్సిన్ 1000 మందికి ఇచ్చారని రాజేష్ భూషణ్ తెలిపారు. కాగా.. అమెరికా, రష్యా, చైనా దేశాలకు చెందిన వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్‌లో ఫేజ్ 3లో ఉన్నాయని వెల్లడించారు. కాగా.. ఏప్రిల్‌తో పోలిస్తే.. ప్రస్తుతం రికవరీ రేటు 7.85 శాతం నుంచి 64.4 శాతానికి పెరిగిందని రాజేష్ భూషణ్ స్పష్టం చేశారు.