నటకిరీటి రాజేంద్రప్రసాద్ నటనకి 40 ఏళ్లు..

  • IndiaGlitz, [Tuesday,September 05 2017]

హాస్య క‌థానాయ‌కుడికి స్టార్ ఇమేజ్‌ని తీసుకొచ్చిన న‌టుడు రాజేంద్ర‌ప్ర‌సాద్‌. ఆయ‌న న‌టించిన తొలి చిత్రం 'స్నేహం'. బాపు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 5, 1977న‌ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అంటే.. వెండితెర‌పై రాజేంద్ర‌ప్ర‌సాద్ చేస్తున్న సంద‌డికి నేటితో 40 ఏళ్లు పూర్త‌వుతున్నాయ‌న్న‌మాట‌. అయితే ఈ 40 ఏళ్ల‌ల్లో ఒక్క కామెడీ వేషాల‌కే రాజేంద్ర‌ప్ర‌సాద్ ప‌రిమితం కాలేదు.. విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లెన్నింటికో ప్రాణం పోశాడు.
'లేడీస్ టైల‌ర్‌', 'ఏప్రిల్ 1 విడుద‌ల‌', 'పెళ్లిపుస్త‌కం', 'మిస్ట‌ర్ పెళ్లాం', 'మాయ‌లోడు', 'రాజేంద్రుడు గ‌జేంద్రుడు', 'ఆ ఒక్క‌టీ అడ‌క్కు', 'అప్పుల అప్పారావు' త‌దిత‌ర చిత్రాల్లో హాస్యంతో పాటు న‌వ‌ర‌సాల‌కి చోటు ఉంటే.. 'ఎర్ర‌మందారం', 'ఆ న‌లుగురు', 'మీ శ్రేయోభిలాషి', 'ఓన‌మాలు' త‌దిత‌ర చిత్రాలు ఆయ‌నలోని న‌టుడ్ని కొత్త కోణంలో చూపాయి. న‌టుడిగా 40 ఏళ్ల ప్ర‌స్థానాన్ని పూర్తిచేసుకుంటున్న రాజేంద్ర‌ప్ర‌సాద్‌కి ఈ సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలుపుదాం.