సినీ  పరిశ్రమను వదలని మహమ్మారి.. రాజేంద్ర ప్రసాద్, విష్ణువిశాల్‌లకు కరోనా పాజిటివ్

  • IndiaGlitz, [Sunday,January 09 2022]

దేశంలో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. నానాటికీ కేసులు పెరుగుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు వైరస్ బారినపడుతున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమపై కోవిడ్ పంజా విసురుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలకు కరోనా సోకింది. కమల్ హాసన్, విక్రమ్, వడివేలు, త్రిష, సత్యరాజ్, మహేశ్ బాబు, తమన్, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, విశ్వక్ సేన్, కరీనా కపూర్, అమృత అరోరా, నోరా ఫతేహి తదితరులకు పాజిటివ్‌గా తేలింది. వీరిలో పలువురు కోలుకోగా.. మరికొందరు ఐసోలేషన్‌లో వున్నారు.

తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు, నటకిరిటీ డాక్టర్ రాజేంద్రప్రసాద్‌ కరోనా బారినపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయన హైదరాబాద్‌ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఆయన స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని... ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు.

ఇక ‘ఎఫ్‌ఐఆర్‌' ఫేమ్‌ విష్ణు విశాల్‌ కూడా కరోనా బారినపడ్డారు. 2022 పాజిటివ్‌ రిజల్ట్ తో ప్రారంభమైందని.. తనకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. గడిచిన వారం రోజులుగా తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా విష్ణు విశాల్ వెల్లడించారు. జాగ్రత్తగా ఉండండి.. భయంకరంగా ఒళ్లు నొప్పులు, ముక్క బ్లాక్‌ అయిపోయింది. గొంతు నొప్పిగా , కాస్త ఫీవర్‌గా ఉందని ఆయన చెప్పారు. దీంతో అభిమానులంతా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. వరుసపెట్టి సినీ ప్రముఖులు కోవిడ్ బారినపడుతుండటంతో చాలా వరకు షూటింగ్‌లు రద్దవ్వగా.. థియేటర్లు సైతం 50 శాతం ఆక్యూపెన్సీతో నడుస్తున్నాయి.