Rajasingh: బిర్యానీ బాలేదన్నందుకు కస్టమర్స్‌ను చావబాదారు.. రాజాసింగ్ ఆగ్రహం..
- IndiaGlitz, [Monday,January 01 2024]
బిర్యానీ బాగలేనందుకు హైదరాబాద్‌లోని ఓ హోటల్ సిబ్బంది కస్టమర్లపై వీరంగం సృష్టించారు. చేతికి అందిన కర్రలు, కుర్చీలతో దాడి చేశారు. ఈ దాడిలో కొంతమంది కస్టమర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) మండిపడ్డారు. తక్షణమే హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే హోటల్‌కు నిప్పు పెడతామని హెచ్చరించారు.
అసలు ఏం జరిగిందంటే.. దూల్ పేటకు చెందిన కొందరు యువతీ యువకులు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు అబిడ్స్‌లో ఉన్న గ్రాండ్ హోటల్‌కు వెళ్లారు. తినేందుకు బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే బిర్యానీ సరిగా ఉడకలేదని.. ముక్కలు సరిగా రాలేదని వెయిటర్స్‌ని ప్రశ్నించారు. దీంతో గొడవ మొదలైంది. బిల్లు కట్టే సమయంలో ఈ గొడవ మరింత పెద్దది అయింది. దీంతో ఒక్కసారిగా హోటల్ సిబ్బంది కర్రలతో కస్టమర్స్‌ను విచక్షణరహితంగా చావబాదారు. అంతేకాదు కుర్చీలు కూడా విసిరేశారు. ఈ క్రమంలో కస్టమర్లు కూడా ఎదురుదాడి చేశారు. ఈ దాడిలో కొంతమందికి తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న రాజాసింగ్ హోటల్ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ ఏరియాకు చెందిన వారిపై హోటల్ సిబ్బంది అకారణంగా దాడి చేసి గాయపరిచారని ధ్వజమెత్తారు. బాధ్యులైన హోటల్ సిబ్బంది, యాజమాన్యంపై కేసు నమోదు చేసుకుని చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే హోటల్‌పై దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో పోలీసులు కస్టమర్లపై దాడికి పాల్పడిన కొందరు వెయిటర్లను అరెస్ట్ చేశారు. అలాగే హోటల్ యాజమాన్యంపై 324, 504, 509 కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. మరోవైపు మరోవైపు హోటల్ యాజమాన్యం కూడా కస్టమర్లపై ఫిర్యాదు చేసింది.