జగన్ 'ఇంగ్లిష్' నిర్ణయం సరైనదే..: రాజశేఖర్
- IndiaGlitz, [Tuesday,November 12 2019]
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని అన్ని తరగతులను ఇంగ్లిష్ మీడియంలోకి మారుస్తూ వైఎస్ జగన్ సర్కార్ ఈ నెల 5న జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. మొదటి అన్ని తరగతులకు ఇంగ్లిష్ మీడియం వర్తింపజేయాలని భావించిన ప్రభుత్వం.. ఆ తర్వాత కాసింత వెనక్కి తగ్గి మొదట 01 నుంచి 06 తరగతుల వరకే అని నిర్ణయించింది. ఆ తర్వాత మిగిలిన తరగతులకు ఇంగ్లిష్ బోధన అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి జీవో జారీ చేసిన సర్కార్.. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకురానుంది. కాగా వేసవి కాలం సెలవుల్లో ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించడం.. ఈ గ్యాప్‌లోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని స్వయానా సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, పలు భాషా సంఘాలు తప్పుబట్టాయి. మరోవైపు కొందరు భాషా వేత్తలు, ప్రముఖులు జగన్ నిర్ణయాన్ని సాదరంగా ఆహ్వానించారు. అంతేకాదు.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారిపై జగన్ ఇటీవలే స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ల వర్షం కురిపించారు. తాజాగా జగన్ నిర్ణయంపై టాలీవుడ్ సీనియర్ నటుడు, వైసీపీ నేత డా. రాజశేఖర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఈ సందర్భంగా జగన్ నిర్ణయానికి తాను మద్దతిస్తున్నట్లు ట్విట్టర్‌లో స్పష్టం చేశారు.
జగన్ నిర్ణయం సరైనదే..!
‘ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు తీసుకున్న నిర్ణయం పూర్తిగా సరైనదే. ఆధునిక ప్రపంచంలో ఉద్యోగాలు పొందాలన్నా.. ఇతరులతో సంభాషించాలన్నా ఇంగ్లిష్ భాషే ముఖ్యం. ఇంగ్లిష్ రాకపోవడంతో చాలా మంది విద్యార్థులు తమ ఉన్నత చదువుల్లో, ఉద్యోగాలు తెచ్చుకోవడంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలకు జగన్ తీసుకున్న నిర్ణయం ముగింపు పలుకుతుందని. నేను ఈ నిర్ణయానికి పూర్తిగా మద్దతు పలుకుతున్నాను. అలాగే, మన మాతృభాష తెలుగును కూడా తప్పనిసరిగా ఒక సబ్జెక్ట్‌గా ఉంచాలని నేను భావిస్తున్నాను. సమాజంలోని అందరికీ విద్య సమానంగా అందాలి’ అని రాజశేఖర్ ట్వీట్టర్‌లో రాసుకొచ్చారు. మొత్తానికి చూస్తే.. జగన్ తీసుకున్న నిర్ణయం మంచిదేనని రెండు ట్వీట్లతో రాజశేఖర్ తేల్చేశారన్న మాట. ఈ హీరోగారికి ట్వీట్స్‌కు విమర్శలు ఏ రేంజ్‌లో వస్తాయో వేచి చూడాల్సిందే మరి.