నేను అధినేతగానే ఉంటా.. సీఎం ఆయనే..: రజనీ క్లారిటీ
- IndiaGlitz, [Thursday,March 12 2020]
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎప్పుడెప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా..? అని అభిమానులు, తమిళ ప్రజానీకం వేయి కళ్లతో వేచి చూస్తున్న సంగతి తెలిసిందే. ఇదిగో.. అదుగో అంటున్నప్పటికీ సుమారు రెండేళ్లు అలాగే గడిచిపోయాయ్. తమిళనాట ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఎట్టకేలకు ఆయన రంగంలోకి దూకుతున్నట్లు ప్రకటించేశారు. 2021 ఎన్నికలకు రెడీ అయ్యేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న తలైవా.. ఈ మేరకు గురువారం ఉదయం చెన్నైలోని రజనీకాంత్‌కు చెందిన కల్యాణ మంటపంలో మీడియా మీట్ నిర్వహించి పార్టీపై.. సీఎం అభ్యర్థిపై ఆయన క్లారిటీ ఇచ్చేశారు. రజనీకాంత్ తాజా వ్యాఖ్యలతో పొలిటికల్ ఎంట్రీపై గురువారంతో క్లారిటీ వచ్చేసింది.
ఆ ఇద్దరు లేరు గనుకే..!
‘వ్యవస్థలో మార్పు కోసమే రాజకీయ ప్రవేశం చేస్తున్నాను. రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నా. తమిళనాడులో శక్తివంతమైన రెండు పార్టీలో తలపడబోతున్నాను. జయలలిత మృతి తర్వాత రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. కరుణానిధి, జయలలిత లేకపోవడం వల్లే ప్రజల్లోకి వస్తున్నాను. రాష్ట్ర పరిస్థితులను క్షుణ్ణంగా విశ్లేషించాను. అధికార పార్టీ అధ్యక్షుడికి ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర ఉండొద్దు. పదవులపై నాకు ఎలాంటి ఆశ లేదు. ప్రజలకు అన్న లా ఉండే నాయకులను తయారు చేయడమే నా లక్ష్యం. తమిళనాడు ప్రజలు కరుణానిధిని చూసే డీఎంకేకు అవకాశం ఇచ్చారు.
70 శాతం ప్రజలు కరుణానిధిని చూసే ఓటు వేశారు. అదే ఫార్ములాను అన్నా డీఎంకే కూడా అనుసరించింది’ అని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.
నాకు సీఎం పదవి అక్కర్లేదు..!
‘నా వయసు 68.. నాకు సీఎం పదవి అవసరమా?. పార్టీ అధినేతగానే ఉంటా.. విద్యావంతుడ్ని సీఎం చేస్తాను. అన్ని పార్టీల్లో సీఎంగా పార్టీ అధినేతే ఉంటున్నారు. పార్టీ అధ్యక్షుడికి ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర ఉండకూడదు. నేను పార్టీ అధినేతగా మాత్రమే ఉంటాను. బాగా చదువుకున్న విజ్ఞానవంతుడినే సీఎంని చేస్తాను. పదవులు ఆశించే వారు నాకు అవసరం లేదు. రాజకీయ నాయకుల దృష్టిలో ప్రజలంటే కేవలం ఓట్లే. ఇప్పుడున్న పార్టీల్లో 50ఏళ్లకు పైబడినవాళ్లే ఉన్నారు. రాజకీయాల్లోకి యువకులు రావాలి. ఎంపీలు, ఎమ్మెల్యేల వారసులకే టికెట్లు ఇస్తున్నారు. నా పార్టీలో 60 నుంచి 65శాతం యువతకే టికెట్లు ఇస్తాను. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లను పార్టీలోకి ఆహ్వానిస్తాను. ప్రజల మనస్తత్వం, వ్యవస్థలో మార్పురావాలి. పార్టీ బలోపేతానికి అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటాను. పదవుల కోసం వచ్చేవారు మాకు అవసరం లేదు. కాబోయే సీఎం రజనీకాంత్ అనే నినాదాలు వద్దు’ అని రజనీకాంత్ స్పష్టం చేశారు.
రజనీ చివరికి ఏం చేస్తారో!
రజనీకాంత్ మాట్లాడుతున్నంత సేపు అభిమానులు, అనుచరులు ఈలలు, కేకలతో హోరెత్తించారు. మొత్తానికి చూస్తే.. రజనీ క్లారిటీ ఇచ్చేశారు. ఇక పార్టీ పేరు ప్రకటన ఎప్పుడు ఉంటుందో..? ఇంతకీ ఆయన సీఎం అభ్యర్థిగా ఎవరిని నిలబెడతారో..? ఎవరికి మద్దతిస్తారో అనేదానిపై తమిళనాట రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అంతేకాదు.. యువతకే టికెట్లు.. ప్రాధాన్యత ఇస్తానని చెప్పడం శుభపరిణామం అని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. ఇలా రజనీ మాదిరిగానే చాలా మంది తాను సీఎం అభ్యర్థిని కాదని.. దళితుడ్ని నిలబెడతానని, విద్యావంతున్ని నిలబెడతానని ప్రస్తుతం ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న వాళ్లు చాలా మందే చెప్పారు. మరి చివరికి రజనీ ఎలా చేస్తారో ఏంటో..!