తార‌క్‌, చెర్రీల‌కు రాజ‌మౌళి స‌వాల్‌

లాక్‌డౌన్ వేళ సినీ సెల‌బ్రిటీలంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఇళ్ల‌ల్లోకి ప‌ని మ‌నుషుల‌ను కూడా సెల‌బ్రిటీలు రానీయ‌డం లేదు స‌రిక‌దా! ఎవ‌రింటి ప‌నిని వారే చేసుకుంటున్నారు. అంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే ‘అర్జున్‌రెడ్డి’ డైరెక్ట‌ర్ సందీప్ వంగా ఓ స‌రికొత్త ఛాలెంజ్‌ను షురూ చేయ‌డంతో ఇప్పుడు టాలీవుడ్‌లో ఛాలెంజ్‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. అస‌లు విష‌యంలోకి వెళితే ఆదివారం రోజున సందీప్ వంగా ఇంటి ప‌నుల‌న్నింటినీ చేసి ..ఇంట్లోని అస‌లు మ‌గాడెవ‌డూ ఇలాంటి క్వారంటైన్ స‌మ‌యంలో ఇళ్ల‌ల్లోని మ‌హిళ‌ల‌తో ప‌నిచేయించ‌రు..‘బీ ది రియ‌ల్ మేన్‌’ అంటూ రాజ‌మౌళికి ఛాలెంజ్ విసిరాడు.

సందీప్ ఛాలెంజ్‌కు ఆదివార‌మే ఓకే చెప్పిన రాజ‌మౌళి సోమ‌వారం రోజున తాను ఇంటి ప‌నులు చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తాన‌ని తెలిపారు. అన్న‌ట్లుగానే రాజ‌మౌళి ఈరోజు ఇంటి ప‌నులు(ఇల్లు ఊడ‌వ‌డం, బ‌ట్ట పెట్టి నేల‌ను శుభ్ర‌ప‌రచ‌డం, కిటీకీలు, త‌లుపుల‌ను శుభ్ర‌ప‌రచ‌డం వంటివి) చేసి ఆ వీడియోను త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ‘బీ ది రియ‌ల్ మేన్ ’ ఛాలెంజ్‌ను తార‌క్, చ‌ర‌ణ్‌ల‌తో పాటు త‌న అన్న‌య్య ఎం.ఎం.కీర‌వాణి, డైరెక్ట‌ర్ సుకుమార్‌, బాహుబ‌లి నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ విసిరాడు. దీంతో మ‌రింత ఫ‌న్‌ను మ‌నం చూడొచ్చున‌ని మెసేజ్ కూడా పెట్టారు రాజ‌మౌళి. మరి వీరందరూ ఈ ఛాలెంజ్‌ను ఎప్పుడు పూర్తి చేస్తారు వేచి చూడాలి.