RRR రిలీజ్ డేట్ చెప్పేసిన రాజమౌళి..
- IndiaGlitz, [Wednesday,February 05 2020]
ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న మరోసారి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకునే దిశగా RRRను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకూ చిన్న పాటి లుక్‌గానీ.. కనీసం ఆర్ఆర్ఆర్‌కు అర్థమేంటో కూడా దర్శకుడు చెప్పలేదు. దీంతో మెగాభిమానులు, నందమూరి అభిమానులు, జక్కన్న వీరాభిమానులు వేయి కళ్లతో వేచి చూశారు. అయితే అభిమానుల ఆశలపై జక్కన్న మరోసారి నీళ్లు జల్లారు.
వాయిదా.. అందుకే ఇంత సమయం!
అయితే ఇన్ని రోజులుగా సస్పెన్స్ నడిపిన రాజమౌళి ఇవాళ సడన్ సర్‌ఫ్రైజ్ ఇచ్చారు. దీన్ని సర్‌ఫ్రైజ్ అనడం కంటే సడన్ షాక్ అంటే సరిగ్గా సెట్ అవుతుందేమో మరి. రిలీజ్ డేట్‌పై ఇన్ని రోజులు నెలకొన్న అనుమానాలు, ఊహాగానాలకు తాజా ట్వీట్‌తో జక్కన్న ఫుల్ స్టాప్ పెట్టేశారు. సినిమాను 2021 జనవరి 8న సినిమాను విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ ఏడాదిలో ఉండొచ్చని అందరూ భావించారు కానీ.. ఇలా పోస్ట్ పోన్ చేస్తారని మాత్రం అభిమానులు ఊహించలేదు. అత్యుత్తమమైన ఔట్‌పుట్ ఇవ్వడం కోసమే ఎక్కువ సమయం తీసుకుంటున్నట్టుగా చిత్రబృందం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
మీ నిరుత్సాహాన్ని అర్థం చేసుకోగలం..!
‘మీరు అందిస్తోన్న ప్రేమ, ప్రోత్సాహంతో మేం ఎంతో కష్టపడుతున్నాం. నిరంతరాయంగా షూటింగ్ చేస్తున్నాం. ఇంతకు ముందు ఎన్నడూ చూడని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను మీకు అందించడానికి 24 గంటలూ పనిచేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో విడుదల తేదీని వాయిదా వేస్తున్నాం. మీ నిరుత్సాహాన్ని మేం అర్థం చేసుకోగలం. కానీ, మేం చేయాల్సింది ఇంకా చాలా ఉంది. మీకు మంచి సినిమాను అందించడానికి మాకు కావాల్సింది కేవలం సమయం మాత్రమే’ అని జక్కన్న ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. అయితే ఈ ప్రకటనతో అభిమానులు కాసింత జోష్‌లో కాసింత మూడాఫ్ అయ్యారు.
పక్కానా..!?
RRR మొదలైనప్పుడు జులై 31 2020 రిలీజ్ అని చెప్పిన జక్కన్న తాజాగా డేట్ మళ్లీ మార్చేస్తూ జనవరి-08, 2021కు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. కాగా.. ఇప్పుడు చెప్పిన డేట్‌ను అయినా జక్కన్న పక్కాగా ఫాలో అవుతారా అనేది కూడా సందేహమే. ఎందుకంటే గతంలో బాహుబలి విషయంలోనూ రాజమౌళి ఇలానే రెండు మూడు డేట్స్ మార్చారు. దీంతో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయ్. మొత్తానికి చూస్తే సినిమాకు సంబంధించి సడన్‌గా అనౌన్స్‌మెంట్ ఇచ్చినప్పటికీ అనుమానాలు మాత్రం కోకొల్లలుగా మిగిలిపోయాయి. మరి ఆర్ఆర్ఆర్ పక్కాగా వస్తుందా లేదా..? అనేది తెలియాలంటే.. 2021లో ఉండే పోటీని బట్టి తెలుస్తుందేమో.