Raja Singh:అందుకే ప్రధాని మోదీ సభకు హాజరుకాలేదు..? రాజాసింగ్ క్లారిటీ..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం హైదరాబాద్ బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సభకు బీజేపీ కీలక నేతలతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రాజాసింగ్ మాత్రం ఈ సభకు హాజరుకాలేదు. దీంతో బీజేపీ కార్యకర్తలతో పాటు ఇతర నేతలు రాజాసింగ్ గైర్హాజరుపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ బహిరంగ సభకు హాజరు కాలేకపోయినందుకు బాధగా ఉందన్నారు. తాను ఎందుకు హాజరుకాలేదో వివరించారు.
ఈ సభలో తాను పాల్గొంటే సభకు వెచ్చించిన మొత్తంలో కొంత భాగం తన ఎన్నికల ఖర్చులోకి వెళుతుందని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్ధి ఎన్నికల ఖర్చు రూ.40 లక్షలకు మించకూడదు అని ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉన్నాయని.. తాను మోదీ సభలో పాల్గొంటే తన ఎన్నికల ప్రచార ఖర్చు పరిమితి దాటే ప్రమాదం ఉందన్నారు. అందుకే ప్రధాని హాజరైన ముఖ్యమైన సభకు హాజరు కాలేకపోయానని స్పష్టం చేశారు. అంతే తప్ప మరే కారణం లేదని పార్టీ కార్యకర్తలు అర్ధం చేసుకోవాలని కోరారు. కాగా ఎల్పీ స్టేడియం గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.
ఇక ఈ సభలో ప్రసంగించిన మోదీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని మోదీ స్పష్టంచేశారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యతిరేక ప్రభుత్వం ఉందని.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అవి నెరవేరలేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆకాంక్షలను పట్టించుకోని వారిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు మార్పును కోరుకుంటున్నారన్నారు. దివంగత నేత అబ్దుల్ కలాంను, ద్రౌపది ముర్ములను రాష్ట్రపతిని చేసిస ఘనత తమదే అన్నారు. లోక్ సభలో తొలి దళిత స్పీకర్ బాలయోగిని చేసింది కూడా నాటి ఎన్డీఏ ప్రభుత్వమేనని మోదీ వెల్లడించారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి సీ టీమ్ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుతో సంబంధాలు ఉన్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతిపరులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని మోదీ హెచ్చరించారు.
ఇదిలా ఉంటే ఈ సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ సకల జనులు సమరం చేస్తేనే తెలంగాణ వచ్చిందని గుర్తుచేశారు. సామాజిక తెలంగాణ... బీసీ తెలంగాణకు తాను పూర్తిగా మద్దతిస్తున్నానన్నారు. తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందని పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రధాని మోదీ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకొని ఉంటే ఆర్టికల్ 370ని రద్దు చేసేవారు కాదని.. అలాగే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునేవారు కాదన్నారు. మూడోసారి కూడా మోదీ ప్రధాని అవుతారని.. ఔర్ ఏక్ బార్ మోదీ అంటూ నినదించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments