రాజా నరసింహా గ్యారెంటీ హిట్ - నిర్మాత సాధు శేఖర్
- IndiaGlitz, [Monday,December 30 2019]
‘‘కొన్నేళ్లగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నాం. ‘అత్తారింటికి దారేది’, ‘ఎవడు’, ‘రేసుగుర్రం’ వంటి హిట్ చిత్రాలను పంపిణీ చేశాం. ఆ అనుభవంతోనే నిర్మాణరంగంలో అడుగుపెట్టి తొలి ప్రయత్నంగా ‘మధుర రాజా’ చిత్రాన్ని తెలుగులో ‘రాజా నరసింహా’గా అనువదించాం. మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందచేయాలన్నదే మా లక్ష్యం’’ అని నిర్మాత సాధు శేఖర్ అన్నారు. మమ్ముట్టి హీరోగా ‘మన్యం పులి’ ఫేం వైశాక్ దర్శకత్వం వహించిన చిత్రమిది. జై, మహిమా నంబియార్ కీలక పాత్రధారులు. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు.
జై చెన్నకేశవ పిక్చర్స్ పతాకంపై జనవరి ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకొస్తుందీ సినిమా. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాత సాఽధు శేఖర్ మాట్లాడుతూ ‘‘నిర్మాతగా తొలి సినిమా ఇది. వైశాక్, మమ్ముట్టి కాంబినేషన్ మీద నమ్మకంతో ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాం. ఓ అటవీ ప్రాంతంలో కల్తీ సారా వ్యాపారంతో అమాయకుల్ని మోసం చేస్తున్న ఓ వ్యక్తికి ఆ ప్రాంతానికి అండగా నిలిచే రాజా ఎలా బుద్ధి చెప్పాడు అన్నది సినిమా ఇతివృత్తం. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. చక్కని సందేశం కూడా ఉంది. నమ్మితే ప్రాణమిచ్చే రాజా పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించారు. ఆయన పాత్రకు తగ్గట్టే అత్యంత బలమైన పాత్రలో ప్రతినాయకుడిగా జగపతిబాబు చక్కని నటన కనబర్చారు. సన్నీలియోన్ ప్రత్యేక గీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.
మన నేటివిటీకి తగ్గట్టే స్ట్రెయిట్ సినిమాలా ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నాం కాబట్టి సినిమా విడుదలకు అంతగా ఇబ్బంది పడలేదు. కొత్త సంవత్సరంలో మా చిత్రం గ్యారెంటీగా హిట్ అవుతుంది’’ అని తెలిపారు.